Gautam Gambhir : “కోల్ కతా జట్టు ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదు. గిల్ ఫామ్ లో లేకపోయినప్పటికీ అతనికి అవకాశం ఇచ్చాడు.. ఏకంగా వైస్ కెప్టెన్సీ పదవి కట్టబెట్టాడు.. స్థిరంగా రాణిస్తున్న గైక్వాడ్ ను ఎంపిక చేయలేదు. జట్టు కూర్పు విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఇలా అయితే నాణ్యమైన ఆటగాళ్లకు ఎప్పుడు అవకాశాలు లభిస్తాయి? కోచ్ అంటే సమతూకం ఉండాలి. ఇలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్” శ్రీలంక టోర్నీకి టీమిండియాను ఎంపిక చేసిన తర్వాత గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో వినిపిస్తున్న విమర్శలివి..
వాస్తవానికి శ్రీలంక టోర్నీలో టి20 జట్టుకు సంబంధించి కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సూర్య కుమార్ యాదవ్ టి20 వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ. తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో తేలిపోయాడు. రిలే క్యాచ్ మినహా సూర్య కుమార్ యాదవ్ ముద్ర అంటూ లేకుండా పోయింది. అయినప్పటికీ 2026 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని హార్దిక్ ను పక్కనపెట్టి సూర్య కుమార్ యాదవ్ కు గౌతమ్ గంభీర్ అవకాశాలు ఇచ్చాడు. 2012లో ఐపీఎల్ ద్వారా కోల్ కతా జట్టులోకి అడుగుపెట్టిన సూర్య.. ఆ ఏడాది అద్భుతంగా ఆడాడు. కోల్ కతా ఆ సీజన్లో విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆ ఏడాది అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో సూర్యకుమార్ యాదవ్ sky గా పేరు పొందాడు. అప్పటినుంచి గౌతమ్ గంభీర్, సూర్య కుమార్ యాదవ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందువల్లే అతడిని శ్రీలంక తో జరిగే టి20 కప్ కు సారధిగా నియమించాడని తెలుస్తోంది.
ఇక గిల్ కూడా ఇటీవల స్థిరంగా ఆడలేక పోతున్నాడు. జింబాబ్వే తో 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్ భారత్ దక్కించుకున్నప్పటికీ.. అందులో గిల్ నాయకత్వం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. గత వన్డే వరల్డ్ కప్ లోనూ గిల్ గొప్పగా ఆకట్టుకోలేదు. అందువల్లే టి20 వరల్డ్ కప్ లోనూ అతడు ప్లే -15 ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని గిల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించినట్లు తెలుస్తోంది.. మరోవైపు స్థిరంగా రాణిస్తున్న రుతు రాజ్ గైక్వాడ్ ను, జింబాబ్వే తో జరిగిన టి20 సిరీస్ లో రికార్డ్ స్థాయి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను పక్కన పెట్టడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే వీరిని ఎందుకు ఎంపిక చేయలేదు అనే విషయం పట్ల అటు గంభీర్, బిసిసిఐ ఎటువంటి వివరణా ఇవ్వలేదు. అయితే గౌతమ్ గంభీర్ కోల్ కతా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లకు అవకాశం కల్పించడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.
మరోవైపు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని గంభీర్ జట్టు ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అటు బీసీసీఐ ప్రెసిడెంట్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా వంటి వారు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. “గౌతమ్ గంభీర్ వచ్చిందే ఇప్పుడు. జట్టు ఎంపిక అతని చేతుల్లో ఉంటుంది. జయాపజయాల తర్వాత అతడి పనితీరు పై సమీక్షించేందుకు అవకాశం ఉంటుందని” బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం జట్టు ఎంపిక విషయంలో గౌతమ్ గంభీర్ కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.