IPL 2024: ఐపీఎల్ నుంచి ఐదుగురు కెప్టెన్లు ఔట్.. కారణమిదే..

ఐపీఎల్ లో బీసీసీఐ చేతిలో నిషేధానికి గురయ్యే ఆటగాళ్ల జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 20, 2024 12:33 pm

IPL 2024

Follow us on

IPL 2024: డబ్బు చెల్లింపు, సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై బీసీసీఐ ఎంత ఉదారత చూపిస్తుందో.. క్రమశిక్షణ విషయంలోనూ అంతే కచ్చితత్వంతో ఉంటుంది. ఎంత పెద్ద ఆటగాళ్లయినప్పటికీ ఏమాత్రం మినహాయింపు ఇవ్వదు. హార్దిక్ పాండ్యా పై ఎలా వ్యవహరిస్తుందో.. రోహిత్ శర్మ పై కూడా అలాంటి తీరునే ప్రదర్శిస్తుంది. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని జట్లకు చెందిన కెప్టెన్లు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్ లాంటి క్రికెట్లో క్రమశిక్షణకు పాతరేస్తున్నారు. ఫలితంగా బీసీసీఐ కొరడా ఝుళిపిస్తోంది. ఏకంగా ఐదుగురు కెప్టెన్లపై నిషేధం విధించేందుకు సమాయత్తమవుతోంది.

ఐపీఎల్ లో బీసీసీఐ చేతిలో నిషేధానికి గురయ్యే ఆటగాళ్ల జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. వాస్తవానికి వీరంతా దిగ్గజ ఆటగాళ్లు. మైదానంలో జెంటిల్మెన్ గేమ్ ఆడతారు. అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చాటుతారు . అయితే వీరిపై బీసీసీఐ తీవ్రమైన కోపంతో ఉంది.

ఇప్పటివరకు ఐపీఎల్ 17వ సీజన్ సగం లీగ్ మ్యాచ్ లు పూర్తిచేసుకుంది. దాదాపు అన్ని జట్లు తలా ఏడు మ్యాచ్ లు ఆడాయి. రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో, కోల్ కతా రెండవ స్థానంలో, చెన్నై మూడవ స్థానంలో, హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. చివరి స్థానంలో బెంగళూరు ఉంది. ఈ జట్లలో ఢిల్లీ కెప్టెన్ పంత్, గుజరాత్ కెప్టెన్ గిల్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సీజన్ లో ఒక్కో మ్యాచ్ లో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది.

ఈ జట్ల కెప్టెన్ లు స్లో ఓవర్ రేట్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆ ఐదు జట్ల కెప్టెన్ లపై బీసీసీఐ అపరాధ రుసుం విధించింది. మరోసారి వారు ఆ తప్పు చేస్తే ఒక మ్యాచ్ నిషేధం విధించనుంది. శుక్రవారం నాటి మ్యాచ్ లో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ స్లో ఓవర్ రేట్ కొనసాగించడంతో, వారికి చెరో 12 లక్షల చొప్పున బీసీసీఐ అపరాధ రుసుం విధించింది.

పంజాబ్, ముంబై జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ లో.. ముంబై జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. 12 లక్షల ఫైన్ విధించింది. మరోసారి ఇలా చేస్తే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది.

ముంబై జట్టు కంటే ముందు ఢిల్లీ, గుజరాత్ స్లో ఓవర్ రేట్ కొనసాగించాయి. దీంతో ఢిల్లీ కెప్టెన్ పంత్, గుజరాత్ కెప్టెన్ గిల్ కు బీసీసీఐ అపరాధ రుసుం విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ కొనసాగించాడు. 24 లక్షల ఫైన్ కట్టాడు. ఇతడు మాత్రమే కాదు కోల్ కతా కెప్టెన్ అయ్యర్, రాజస్థాన్ కెప్టెన్ సంజు సాంసన్ కూడా స్లో ఓవర్ రేట్ కొనసాగించడంతో బీసీసీఐకి ఫైన్ చెల్లించారు.