
‘సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా’ ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమసే. డెబ్బై సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా డైలాగ్ ఇది. అయినా ‘పాతాళ భైరవి’ అనే సినిమా ఈ రోజుకూ తెలుగులో వచ్చిన గొప్ప ఫాంటసీ సినిమాగానే నిలిచిపోయింది. మరి ఇంత గొప్ప సినిమా రాక వెనుక జరిగిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. విజయావారు షావుకారు అనే సినిమా తీసిన తరువాత ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తూ కాలం గడుపుతున్న రోజులు అవి.
ఎవరో రచయిత పింగళిగారు అట, కథ చెబుతా అని తమ చుట్టూ తిరుగుతున్నారని విజయావారుకి తెలిసింది, పిలిపించి కథ విన్నారు, బాగుంది. కానీ మేము ఈ కథతో సినిమా చెయ్యము అని చెప్పారు. కారణం.. ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకొన్నారు విజయావారు. దీనికి కాశీమజీలీ కథలను, అల్లాద్ధీన్ కథలను ప్రేరణగా తీసుకొని కథ ఏదైనా ఉంటే రాయమని కోరారు పింగళిగారిని. అల పుట్టింది ఈ పాతాళభైరవి కథ. కాగా 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రాల్లోనే నేటికీ మేటి చిత్రంగానే చరిత్రలో నిలిచిపోయింది
అయితే ఈ సినిమా నటీనటుల విషయంలో కూడా భలే తమాషా జరిగిందట. మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును హీరోగా, ముక్కామలను ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు విజయావారు. అయితే సంసారం అనే సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ ను చూసిన కె.వి.రెడ్డి తన సినిమాలో ఎన్టీఆర్ హీరో అయితే చాల బాగుంటుందని ఫీల్ అయ్యారు. అలాగే ఓ నాటకంలో ఎస్వీఆర్ ను చూసి.. విలన్ గా ఆయనే కావాలని పట్టుబట్టి మరీ ఎస్వీఆర్ ను విలన్ ను చేశారు. మొత్తానికి కేవీ రెడ్డి వల్ల తెలుగు సినిమాకి గొప్ప హీరో, గొప్ప విలన్ దొరికారు.
ఇక 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఈ సినిమానే కావడం నిజంగా విశేషమే.