https://oktelugu.com/

Duleep trophy 2024 : దులీప్ ట్రోఫీలో సంచలనం.. గిల్ టీమ్ పై ఇండియా – బీ జట్టు గెలుపు

రాహుల్ అవుట్ అయిన తర్వాత ఇండియా - ఏ జట్టు ఓటమి ఖాయమైంది. అయితే ఆకాశ్ దీప్ చివర్లో చెలరేగి ఆడాడు. అతడి ఇన్నింగ్స్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. యష్ దయాల్ మూడు వికెట్లు తీశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2024 / 09:14 PM IST

    Duleep Trophy 2024

    Follow us on

    Duleep trophy 2024 :  దులీప్ ట్రోఫీ -2024 లో ఇండియా – బీ జట్టు ఘన విజయాన్ని సాధించింది. దులీప్ ట్రోఫీలో బోణి సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా ఇండియా – ఏ జట్టును 76 పరుగుల తేడాతో మట్టికరిపించింది.. ఇండియా – బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియా – ఏ జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నాడు.

    ఇండియా – బీ జట్టు శనివారం ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆదివారం ఆ స్కోర్ తో ఆటను ప్రారంభించి 184 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. చివరి రోజు 34 పరుగులకే మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇండియా – ఏ జట్టు బౌలర్ ఆకాశ్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరుకున్నారు. ఆకాష్ దీప్ ఏకంగా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇండియా – బీ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 61 రన్స్ చేశాడు. 47 బంతుల్లోనే అతడు ఈ పరుగులు చేయడం విశేషం. సర్ఫరాజ్ ఖాన్ 36 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

    275 పరుగుల లక్ష్యం తో ఇండియా – ఏ జట్టు బరిలోకి దిగింది. 78 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని చేదించాల్సి ఉండగా.. 198 పరుగులకు కుప్ప కూలింది. కేఎల్ రాహుల్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆకాష్ దీప్ 42 బంతుల్లో 43 పరుగులు చేశాడు. టార్గెట్ చేజ్ చేసే క్రమంలో మయాంక్ అగర్వాల్ మూడు పరుగులకు అవుట్ అయ్యాడు. గిల్ 21 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. అతడు కూడా అవుటయ్యాడు. రియాన్ పరాగ్ (31) గిల్ తో కలిసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు దూకుడుగా ఆడాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. యష్ దయాల్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఇండియా – బీ జట్టు బౌలర్లు విజృంభించడంతో 76 పరుగులకే మిగతా ఐదు వికెట్లను నష్టపోయింది. రాహుల్ క్రీజ్ లో ఉన్నంతవరకు ఇండియా – ఏ జట్టు కు విజయంపై ఆశలు ఉన్నాయి.

    రాహుల్ అవుటైన తర్వాత..

    రాహుల్ అవుట్ అయిన తర్వాత ఇండియా – ఏ జట్టు ఓటమి ఖాయమైంది. అయితే ఆకాశ్ దీప్ చివర్లో చెలరేగి ఆడాడు. అతడి ఇన్నింగ్స్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. యష్ దయాల్ మూడు వికెట్లు తీశాడు. ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా – బీ జట్టు 321 రన్స్ చేసింది. ముషీర్ ఖాన్ 181 పరుగులు చేశాడు. నవదీప్ షైనీ 56 రన్స్ చేశాడు. ఆకాష్ దీప్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఇండియా – ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 231 పరుగులు మాత్రమే చేసింది. కేఎల్ రాహుల్ 37 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ చెరో మూడు వికెట్లు సొంతం చేసుకున్నారు. సాయి కిషోర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.