
టీమిండియాకు విజయాలు నేర్పి ప్రపంచకప్ కలలను నెరవేర్చిన గొప్ప మేధావి, నడిపించే నాయకుడు, కెప్టెన్ ఎంఎస్ ధోని. ఒక విజయవంతమైన కెప్టెన్ గా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న ధోని లాంటి మేధావి సేవలు ఈ దేశానికి ఎంతో అవసరం.
ఇక తమిళనాట కరుణానిధి, జయలలిత మరణం తర్వాత అంతటి ప్రజాదరణ గల నేత లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ ట్రై చేసినా ప్రజలు తిరస్కరించారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రానన్నాడు. ఇక మిగిలింది తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్.
విజయ్ ఎప్పటి నుంచి తన సినిమాల్లో ‘సీఎం’ పాత్రలు, రాజకీయాన్ని ప్రశ్నించే పాత్రలు చేస్తూ సీఎంగా ఫోకస్ అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా తన చిత్రాల్లో చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరిగినా వెరవలేదు. ఇటీవలే పెట్రో ధరలపై నిరసనగా ఓటు వేయడానికి సైకిల్ పై వచ్చి నిరసన తెలిపాడు.
ఒకరు రాజకీయ సినీ రంగాల వైపు చూస్తున్న హీరో విజయ్ అయితే.. మరొకరు అసలు రాజకీయాలకు సంబంధం లేని క్రికెట్ మేధావి. వీరిద్దరూ కలిసిన శుభ సందర్భంగా తమిళనాట వారి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఆ జోష్ లో అభిమానుల అత్యుత్సాహం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
తమిళనాడులో ధోనిని ప్రధాని కావాలని.. హీరో విజయ్ ను సీఎం కావాలని పేర్కొంటూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలియడం దుమారం రేపింది. అసలు రాజకీయాలకు సంబంధం లేని ధోనిని ఈ వివాదంలోకి లాగడంపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరో విజయ్ సీఎం ఓకే కానీ… ధోనిని పీఎం అనవద్దని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది.