KKR Vs DC 2024: ఢిల్లీకి దెబ్బమీద దెబ్బ.. ప్రమాదంలో జట్టు సారథి!

ఐపీఎల్‌లో ఆటతోపాటు రూల్స్‌ పాటించాల్సిందే. నిబంధనలు పాటించకపోతే కలిగే ఇబ్బందులను ఢిల్లీ టీం గుర్తించి భవిష్యత్‌ మ్యాచ్‌లలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

Written By: Raj Shekar, Updated On : April 4, 2024 1:07 pm

KKR Vs DC 2024

Follow us on

KKR Vs DC 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రాస్థాన్‌ రాయల్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. కొన్ని జట్లు గెలుపు ఓటములతో పాయింట్ల పట్టికలో అటూ ఇటూ మారుతున్నాయి. ఇక ముంబై, ఢిల్లీ పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. ముంబై ఆడిన మ్యాచ్‌లు అన్నీ ఓడిపోగా, ఢిల్లీ నాలుగు ఆడి కేవలం ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. తాజాగా విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఢిల్లీ జట్టు సారథి పంత్‌ అర్ధసెంచరీ చేసినా.. లక్ష్యాన్ని జట్టు ఛేదించలేకపోయింది. ఒకవైపు భారీ పరాభవంతో ఉన్న జట్టుకు దెబ్బమీద దెబ్బ తగిలింది. ఇటు జట్టుతోపాటు అటు సారథికి భారీగా పెనాల్టీ విధించింది.

రెండో ఘోర ఓటమి…
ఇక విశాఖపట్నంలో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతానైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 272 పరుగుల భారీ స్కోర్‌ చయేసింది. భారీ లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కేవలం 166 పరుగులకే ఆల్‌ఔట్‌ అయింది. 106 పరుగులతో ఓడి ఐపీఎల్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పరాభవాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక కేకేఆర్‌ ఐపీఎల్‌లో రెండో భారీ స్కోర్‌ నమోదు చేసింది.

స్లో ఓవర్‌ కారణంగా జరిమానా..
ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఢిల్లీకి పెనాల్టీ విధించారు. స్లో ఓవర్‌ రేటు కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషభ్‌ పంత్‌కు రూ.24 లక్షల భారీ పెనాల్టీ విధించారు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం, ఇలాంటి ఘటన ఇదే సీజన్ లో రెండోసారి జరగడంతో ఫైన్‌ మొత్తం పెరిగింది. అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోని ఇతర ఆటగాళ్లందరికీ, డెజిగ్నేటెడ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌కు కూడా రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్‌ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు.

అధికారికంగా ప్రకటన..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఢిల్లీ జట్టు ఓవర్‌రేట్‌ నిబంధనలు ఉల్లంఘించడం ఇది రెండోసారి కావడంతో సారథి పంత్‌కు భారీ జరిమానా విధించినట్లు వివరించింది.జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌కు కూడా పెనాల్టీ వర్తిస్తుందని తెలిపింది. వీరికి రూ.6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఆటతోపాటు రూల్స్‌ పాటించాలి..
ఐపీఎల్‌లో ఆటతోపాటు రూల్స్‌ పాటించాల్సిందే. నిబంధనలు పాటించకపోతే కలిగే ఇబ్బందులను ఢిల్లీ టీం గుర్తించి భవిష్యత్‌ మ్యాచ్‌లలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ తప్పు మరోసారి రిపీట్‌ అయితే.. పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం కూడా పడే అవకాశం ఉంది. అంటే జట్టు సారథికే ముప్పు ఉందన్నమాట.