DC vs MI : ఉత్కంఠ పోరులో ఢిల్లీ అదరగొట్టింది.. ఒకే దెబ్బకు ముంబై, చెన్నైని పడుకోబెట్టింది..

అంతేకాదు నిన్నటి వరకు తనకంటే ముందు స్థానంలో ఉన్న చెన్నై జట్టును వెనక్కి నెట్టింది. బలమైన ముంబై జట్టును ఓడించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

Written By: NARESH, Updated On : April 27, 2024 10:13 pm

DC vs MI

Follow us on

DC vs MI : ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. మొన్నటిదాకా దారుణ ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ జట్టు.. ఇప్పుడు వరుస విజయాలు దక్కించుకుంటున్నది. ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నది. శనివారం సాయంత్రం ముంబై జట్టు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయాన్ని దక్కించుకుంది. పది పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలోకి ఏక బాకింది. నిన్నటిదాకా తనకంటే ముందు ఉన్న చెన్నై జట్టును వెనక్కి నెట్టింది. ఈ విజయం ద్వారా రెండు లాభాలను ఢిల్లీ జట్టు తన ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్ 17వ సీజన్ తొలి హాఫ్ సీజన్ లో ఢిల్లీ జట్టు నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించింది. కానీ, గోడకు కొట్టిన బంతిలాగా బౌన్స్ బ్యాక్ అయి.. అద్భుతమైన ప్రతిభ చూపుతోంది. శనివారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పది పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. మ్యాచ్ చివరి వరకు తీవ్ర ఉత్కంఠ గా సాగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 257 రన్స్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టుకు ఇది హైయెస్ట్ స్కోర్.. ఫ్రేజర్ 84, స్టబ్స్ 48*, షై హోప్ 41 అదరగొట్టారు. దీంతో ఢిల్లీ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ముంబై బౌలర్లలో బుమ్రా 1/35 మాత్రమే సత్తా చాటాడు. అనంతరం ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 రన్స్ చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 63, హార్దిక్ పాండ్యా 46, టిమ్ డేవిడ్ 37 సత్తా చాటినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

వాస్తవానికి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ముంబై జట్టుకు.. ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. కిషన్ 20 పరుగులు చేసి త్వరగానే పెవీలియన్ చేరుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి, ఖలీల్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు. ఫలితంగా ముంబై జట్టు 65 రన్స్ కే మూడు కీలక వికెట్లు నష్టపోయింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి ముంబై ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో హార్దిక్ పాండ్యా రసిక్ బౌలింగ్ అవుటయ్యాడు. అయినప్పటికీ తిలక్ వర్మ తన ఎదురుదాడి కొనసాగించాడు. 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ తో కలిసి దూకుడుగా ఆడాడు. ఈ నేపథ్యంలో విజయ లక్ష్యం క్రమంగా కరిగింది.

ముంబై విజయ సమీకరణం 18 బంతుల్లో 64 పరుగులకు చేరుకున్నప్పుడు.. డేవిడ్ వరుసగా 6, 4, 6 కొట్టడంతో.. ముంబై జట్టులో ఆశలు చిగురించాయి. కానీ, నాలుగో బంతికే డేవిడ్ వెనుతిరిగాడు. చివరి బంతిని తిలక్ వర్మ సిక్స్ కొట్టడంతో ముంబై జట్టుకు 23 పరుగులు లభించాయి. అనంతరం 19 ఓవర్లో ముంబై జట్టు 16 పరుగులు పిండుకుంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ముంబై విజయ లక్ష్యం ఆరు బంతుల్లో 25 పరుగులుగా మారింది. ఈ దశలో తిలక్ వర్మ రన్ అవుట్ కావడంతో ఢిల్లీ జట్టు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఈ ఓవర్లో ముంబై జట్టు ఆటగాళ్లు వుడ్ ఒక సిక్స్, చావ్లా ఫోర్ కొట్టి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించారు.. దీంతో గెలుపు వాకిట పది పరుగుల దూరంలో ముంబై జట్టు నిలిచిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్, ముఖేష్ చిరు మూడు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.

వాస్తవానికి ముంబై జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోయింది. బౌలింగ్లో అత్యంత నాసిరకమైన ప్రదర్శన కనబరిచింది. ఫీల్డింగ్ విషయంలోనూ ఇదే ధోరణి ప్రదర్శించింది. ఫలితంగా ఢిల్లీ జట్టు 257 రన్స్ చేసింది. అబేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. ముంబై జట్టు ఈ లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైంది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు నిన్నటి వరకు తనకంటే ముందు స్థానంలో ఉన్న చెన్నై జట్టును వెనక్కి నెట్టింది. బలమైన ముంబై జట్టును ఓడించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.