David Warner: డేవిడ్ వార్నర్.. ఈ పేరు చెప్తే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుడుతుంది. చూస్తుండగానే మైదానంలో విధ్వంసం సృష్టిస్తాడు. ఎంతటి బౌలరైనా ఎదురుదాడికి దిగుతాడు. సిక్స్, ఫోర్లు అలవోకగా కొడతాడు. ప్రస్తుతం ఈ ఆటగాడు తన చివరి t20 వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో సత్తా చాటి ఆస్ట్రేలియా జట్టుకు కప్ అందించి.. తన కెరియర్ కు ముగింపు పలకాలని భావిస్తున్నాడు. అటువంటి ఈ ఆటగాడు గురువారం బార్బడోస్ వేదికగా ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అర్ద సెంచరీ సాధించాడు. వాస్తవానికి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించే వార్నర్.. ఒమన్ పై మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. వేగంగా కాకుండా టెస్ట్ క్రికెట్ స్థాయిలో పరుగులు తీశాడు.
ఒకానొక దశలో ఒమన్ బౌలర్ల చేతిలో ఆస్ట్రేలియా 12 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 62 పరుగులు మాత్రమే చేసింది.. ఈ దశలో వార్నర్ క్రీజ్ లో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. బౌండరీలు, సిక్సర్లకు బదులు అతడు సింగిల్స్ తీయడం మీదనే దృష్టి సారించాడు. ఈ దశలో స్టోయినీస్ అద్భుతంగా ఆడాడు. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయడం వల్లే ఆస్ట్రేలియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. స్టోయినీస్ రాకతో వార్నర్ లో ఉత్సాహం వచ్చింది. అప్పటిదాకా నింపాదిగా ఆడిన అతను ఒక్కసారిగా బ్యాట్ ఝుళిపించడం మొదలుపెట్టాడు. 51 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ దశలో ఒమన్ బౌలర్ కలిముల్లా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. ఈ హాఫ్ సెంచరీ ద్వారా పురుషుల టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక అర్ద సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్లో వార్నర్ 111 హాఫ్ సెంచరీలు సాధించాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. గేల్ 110 అర్ద సెంచరీలు సాధించాడు.
తాను వేసిన అద్భుతమైన బంతికి వార్నర్ ఔట్ కావడంతో కలిముల్లా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడు మైదానంలోనే బిగ్గర గా అరిచాడు. తన కుడి చేతితో కిక్ లాంటి సంకేతాన్ని చూపించాడు. అలా అవుట్ అయిన తర్వాత డేవిడ్ వార్నర్ నిరాశగా మైదానాన్ని వీడాడు. పరధ్యానంలో తన జట్టు డ్రెస్సింగ్ రూమ్ కాకుండా.. ఒమన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడు. మరికొంత సేపట్లో అందులోకి వెళ్తాడనగా.. వెనకనుంచి క్రీడాకారులు గుర్తుచేయడంతో.. మర్చిపోయానంటూ తిరిగి తన జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. అన్నట్టు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
David Warner almost entered the wrong dressing room pic.twitter.com/Qfmuq1ML0N
— DW 31 FOREVER (@jersey_no_46) June 6, 2024