CSK vs KKR : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. మామూలు ఆటగాళ్లతోనే చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్ చేశాడు ధోని. అతని నాయకత్వంలో చెన్నై జట్టు ఐపిఎల్ ను శాసించింది. ఏకంగా 10సార్లు ఫైనల్ వెళ్ళింది. ఇందులో ఐదుసార్లు విజేతగా నిలిచింది. అదే కాదు ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టుకు అత్యధిక విజయాలు అందించిన ఘనత ధోని పేరు మీద ఉంది. మరే జట్టు కూడా ఈ స్థాయిలో విజయాలు సాధించలేదు. అయితే అలాంటి జట్టు ఇప్పుడు తడబడుతోంది. తల వంచుతోంది. ప్రత్యర్థి ఆటగాళ్ల ముందు తట్టుకోలేక నీరసపడి పోతోంది. శుక్రవారం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సొంతమైదానంలో 103 పరుగులు మాత్రమే చేసింది. ధోని నుంచి మొదలు పెడితే ఏ ఒక్క ఆటగాడు కూడా కోల్ కతా బౌలర్లను ప్రతిఘటించే సాహసం చేయలేదు. చివరికి ఐపీఎల్ ఆడుతున్నామని విషయం మరిచిపోయి.. టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లు పక్కన పెడితే కనీసం సింగిల్ రన్స్ తీయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చెన్నై ఆటగాళ్ల దుస్థితి చూసి.. మైదానంలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు తలవంచుకుని అలా కూర్చున్నారు. చివరికి కొంతమంది అభిమానులు ఈ మ్యాచ్ చూడడం ఎందుకు దండగా అనుకుంటూ.. ఫోన్లో గేమ్స్ ఆడారు.
Also Read : ఒరేయ్ మీరు ఐదుసార్లు ఛాంపియన్లు.. ఇలా ఆడుతున్నారేంట్రా?
సునీల్ నరీన్ అదరగొట్టాడు
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ సునీల్ నరైన్ ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో చెన్నై జట్టుకు చుక్కలు చూపించాడు. త్రిపాటి (18), రవిచంద్రన్ అశ్విన్ (1), ధోని (1) వికెట్లను సునీల్ నరైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో చెన్నై జట్టు మీద అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. గతంలో ముంబై గట్టుకు ఆడిన లసిత్ మలింగ చెన్నై జట్టుపై 31 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేట్ 7.23 గా ఉంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్ సునీల్ నరైన్ 26 వికెట్లు పడగొట్టాడు. ఇతడి ఎకనామి రేట్ 6.29 గా ఉంది. హర్భజన్ సింగ్ 24 వికెట్లు తీశాడు. ఇతడి ఎకనామి రేట్ 6.55 గా ఉంది. పీయూష్ చావ్లా 22 వికెట్లు సాధించాడు. ఇతడి ఎకనామి రేట్ 8.24 గా ఉంది. ఇక ఐపీఎల్ లో ధోనీ వర్సెస్ సునీల్ నరైన్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. ఐపీఎల్ లో ధోని,సునీల్ నరైన్ 19 ఇన్నింగ్స్ లలో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఇందులో సునీల్ నరైన్ ధోనికి 92 బంతులు వేయగా.. అతడు 48 పరుగులు చేశాడు. ఇందులో మూడుసార్లు అవుట్ చేశాడు. ఇక బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ధోని యావరేజ్ 16, స్ట్రైక్ రేట్ 52.17 గా ఉంది.. రెండు బౌండరీలు సాధించగా.. డాట్ బంతుల శాతం 55.4 గా ఉంది. బౌండరీల శాతం 2.17 గా ఉంది.
Also Read : ధోని వచ్చినా.. చెన్నై మరింత చెత్తగా.. ఇంత ఘోరమైన రికార్డులా..