CSK Vs DC: ఐపీఎల్(IPL)లో భాగంగా చెన్నైలోనే చిదంబరం మైదానంలో శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (CSK vs DC) తలపడుతున్నాయి. ఢిల్లీ జట్టు రెండు వరుస విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఇక చెన్నై జట్టు మూడు మ్యాచ్లు ఆడి.. ఒకే ఒక విజయంతో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది.
Also Read: రిటైర్డ్ ఔట్.. రిటైర్డ్ హర్ట్.. రెండిటి మధ్య తేడా ఇదే!
ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ అంచనాలకు తగ్గట్టుగా ఢిల్లీ ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యం నిర్మించలేకపోయారు. ఓపెనర్ మెక్ గూర్క్(0) ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77), అభిషేక్ పోరెల్ (33), అక్షర్ పటేల్ (21), సమీర్ రిజ్వి (20), స్టబ్స్(22) సత్తా చాటడంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే గత మ్యాచ్లో చెన్నై కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. దీంతో అతడు ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్లో ఆడేది అనుమానమేనని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒకవేళ అతడు గనుక ఆడకపోతే.. అతడి స్థానంలో ధోని కెప్టెన్సీ వహించే అవకాశాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ గా గైక్వాడ్ వ్యవహరించాడు. దీనిని బట్టి అతడు గాయం నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది..
ధోని తల్లిదండ్రులు వచ్చారు
చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని.. ఢిల్లీ తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ధోని ఆడుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు అతడి తల్లిదండ్రులు వచ్చారు. కెమెరామెన్ పదేపదే ధోని తల్లిదండ్రులను చూపించడంతో.. ధోని తన రిటర్మెంట్ పై నిర్ణయం ప్రకటిస్తాడని.. అందువల్లే వారు అతడు ఆడే చివరి మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. గత సీజన్లో కూడా తొలి మ్యాచ్ కు ముందు ధోని చెన్నై కెప్టెన్సీ వదిలేసాడు. తదుపరి కెప్టెన్ గా రుతు రాజ్ గైక్వాడ్ ను ప్రకటించాడు. సైలెంట్ గా ఆ నిర్ణయం తీసుకొని ధోని ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాడు.. అయితే ఇప్పుడు కూడా ధోని అటువంటి ఆకస్మాత్తు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ధోని ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి. తాను ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ప్రకటించనని.. తను స్ట్రెచర్ పై ఉన్నా కూడా చెన్నై జట్టు మేనేజ్మెంట్ మైదానానికి తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తుందని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. ధోని అటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. శనివారం నాడు అతడు రిటైర్మెంట్ ప్రకటించకపోవచ్చని అతని అభిమానులు పేర్కొంటున్నారు.. సోషల్ మీడియాలో మాత్రం మరో విధంగా ప్రచారం జరుగుతుంది. ధోని తల్లిదండ్రులు కేవలం అతడు ఆడే మ్యాచ్ చూసేందుకు మాత్రమే వచ్చారని.. ఇందులో ఇటువంటి రిటైర్మెంట్ ప్రకటన లేదని.. ఊహగానాలను నమ్మొద్దని ధోని అభిమానులు సూచిస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే మరికొంత సమయం పడుతుంది.