Gautam Gambhir Criticism: గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా టి20, వన్డేలలో పర్వాలేదు. వాస్తవానికి గత ఏడాది టీమిండియా ఒకటే వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పై ఆడిన ఆ సిరీస్ లో ఓడిపోయింది. టి20 లలో టీమ్ ఇండియాకు తిరుగులేకుండా పోయింది. ఈ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఇక సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి టీమిండియా అత్యంత దారుణమైన రికార్డులను నమోదు చేసుకుంది. 36 సంవత్సరాల తర్వాత స్వదేశంలో కివీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కు గురైంది. బలమైన బ్యాటింగ్, దుర్భేద్యమైన బౌలింగ్ ఉన్నప్పటికీ టీమిండియా కివీస్ ముందు తలవంచింది. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా కివీస్ చేతిలో ఓటమిపాలైంది.. అంతేకాదు తొలిసారిగా టీమిండియా టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురయింది..ఇండియాకు తిరుగులేని రికార్డులు ఉన్న చిన్నస్వామి మైదానంలో ఓటమి పాలైంది.. 19 సంవత్సరాల తర్వాత ఇండియా ఈ మైదానంలో ఓటమిని నమోదు చేసింది. ఇక ఆ తర్వాత బీజీటీలో కంగారు జట్టుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లోనూ భారత్ ఓటమిపాలైంది. పెర్తులో విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఒక మ్యాచ్ డ్రా చేసుకొని.. మిగతా మూడింట్లో ఓటమిపాలైంది. ఇలా వరుస ఓటములతో టీమిండియా తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోలేకపోయింది. ఇక ప్రస్తుత సంవత్సరంలో ఇంగ్లీష్ జట్టుతో ఇటీవల జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓటమిపాలైంది. 350 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు నిర్దేశించినప్పటికీ.. దానిని కాపాడుకోలేక చేతులెత్తేసింది. అంతకుమించి అనేలాగా పరుగుల లక్ష్యాన్ని విధించినప్పటికీ.. దానిని కాపాడుకోలేకపోవడం 92 సంవత్సరాల లో ఇది రెండవసారి. అంతే కాదు ఐదుగురు బ్యాటర్లు శతకాలు సాధించినప్పటికీ, ఒక బౌలర్ 5 వికెట్లు పడగొట్టినప్పటికీ ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
Also Read: టీమిండియా కు దారుణమైన అవమానం.. ఏకంగా జింబాబ్వే సరసన చోటు..
అనవసరమైన పెత్తనం
గౌతమ్ నిర్వాకం వల్లే సీనియర్ ప్లేయర్లు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి సుదీర్ఘ ఫార్మాట్ లో చాలా సంవత్సరాల పాటు ఆడదామని వీరు ముగ్గురు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడో.. అప్పటినుంచి వీరు ముగ్గురు అతనితో వేగలేక సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే సుధీర్ఘ ఫార్మాట్ నుంచి తట్టుకోవడానికి స్పష్టమైన కారణాలు వారు చెప్పలేకపోయినప్పటికీ.. అంతిమంగా జరిగింది అదేనని తెలుస్తోంది. ఇక ఇంగ్లీష్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావడం తో అది జట్టు విజయాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది. వాళ్ళిద్దరినీ కనుక ఆడించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వారు మాత్రమే కాకుండా అభిమన్యు ఈశ్వరన్, కులదీప్ యాదవ్ వంటి వారిని కూడా రిజర్వు బెంచ్ కు పరిమితం చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా రెండవ టెస్టుకు సంబంధించి జట్టు కూర్పులో వైవిధ్యాన్ని చూపించాలని.. అప్పుడే గెలవడానికి అవకాశం ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. జట్టులో గంభీర్ వేలు పెట్టకుండా ఉండాలని.. అప్పుడే ప్రత్యర్థి జట్టుకు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.