Yuvraj Singh Father Comments: క్రికెట్లో తెర వెనుక చాలా విషయాలు జరుగుతుంటాయి. కాకపోతే వాటిని అంతగా ఎవరూ బయటపెట్టరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రికెట్లో జరిగే విషయాలు దాగడం లేదు. పైగా అవి వెలుగులోకి వచ్చి పెను ప్రకంపనలకు నాంది పలుకుతున్నాయి.
క్రికెట్ ఆడే వ్యక్తులు మాత్రమే కాదు.. క్రికెట్ తో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము చూసిన లేదా తమ కంటపడిన విషయాలను బయటకు చెబుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ముందు వరసలో ఉంటారు. క్రికెట్ శిక్షకుడిగా యోగ్ రాజ్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. చాలామంది క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర శిష్యరికం పొందిన క్రికెటర్లు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. అయితే అప్పుడప్పుడు యోగ్ రాజ్ సింగ్ సంచలన విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. గతంలో ధోనిపై తీవ్రస్థాయిలో యోగ్ రాజ్ సింగ్ ఆరోపణలు చేశారు. తన కుమారుడు యువరాజ్ కెప్టెన్ కాకుండా అడ్డుకున్నది అతడేనని.. అతడి కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం అతడేనని యోగ్ రాజ్ సింగ్ ఆరోపించారు. అప్పట్లో అతడు చేసిన ఆ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
మళ్లీ ఇప్పుడు
యోగ్ రాజ్ సింగ్ ఇప్పుడు మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెలక్షన్ కమిటీలో ఒకప్పుడు సభ్యుడిగా ఉన్న మోహిందర్ అమర్నాథ్ ఏడుగురు ప్లేయర్ల జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు.. 2011లో టీమ్ ఇండియా వన్డే సమరంలో విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, మహమ్మద్ కైఫ్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజ ప్లేయర్లు క్రికెట్ కు వీడ్కోలు పలుకు ఎలా చేశారని ఆరోపించారు. పట్ల కంగారు, ఇంగ్లీష్ గడ్డల మీద జరిగిన టెస్ట్ సిరీస్ లలో భారత్ సున్నా ఫలితంతో ఇంటికి రావడంతో.. ధోనిని కూడా తొలగించారని యోగ్ రాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో యోగ్ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” క్రికెట్ లో అవకాశాలు రావడమే అత్యంత అరుదు. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకొని జట్టు కోసం కొంతమంది ప్లేయర్లు ఆడుతుంటారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టడంలో అమర్నాథ్ సిద్ధహస్తుడు. కనీసం ప్లేయర్లకు అవకాశాలు కూడా ఇవ్వలేదు. లెజెండరీ ఆటగాళ్లకు గౌరవం కూడా ఇవ్వలేదు. దీంతో చాలామంది ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత మళ్ళీ వారు జట్టులోకి రావాలని ఆలోచన కూడా చేయలేదు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. అసలు అటువంటి ప్లేయర్లను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉండాలి కదా. అలాంటి వారి వల్లే జట్టు విజయం సాధిస్తుంది కదా. ఆ మాత్రం విచక్షణ కూడా లేకుండా అలా వ్యవహరించడం ఏ విలువలకు నిదర్శనం. ఇటువంటివారు పెద్దపెద్ద స్థానాల్లో ఉన్నప్పుడు గొప్ప గొప్ప ఆటగాళ్లు ఎలా పుడతారు.. గొప్ప గొప్ప ఆటగాళ్లు జట్టులో ఎలా నిలబడగలుగుతారు.. ఇలాంటివారు ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడ కూడా వెలుగొంద కూడదని” యోగ్ రాజ్ సింగ్ ఆరోపణలు చేశారు.
అంతకుముందు ధోనిపై కూడా యోగ్ రాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కొడుకు కెరియర్ మొత్తం నాశనం కావడానికి కారణం అతడేనని మండిపడ్డారు. అతడు లేకపోతే కచ్చితంగా తన కొడుకు భారత జట్టుకు సారధి అయ్యేవాడని వ్యాఖ్యానించారు.. భారత జట్టుకు కప్ అందించినప్పటికీ.. తన కొడుకు త్యాగాన్ని గుర్తించడంలో మేనేజ్మెంట్ విఫలమైందని.. ధోని పేరు రాకుండా అడ్డుపడ్డాడని యోగ్ రాజ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.