Shardul Thakur vs Nitish Kumar Reddy: ఎరుపు రంగు బంతి ప్రయాణాన్ని భారత్ రేపటి నుంచి మొదలు పెడుతుంది. ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సుదీర్ఘ సమరంలో పోటీ పడనుంది. 2025 -27 డబ్ల్యూటీసీ పరంపరలో భాగంగా భారత్ ఏకంగా ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ భారత జట్టు భవితవ్యానికి అత్యంత ముఖ్యమైనది కావడంతో.. పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భారత జట్టులో మాత్రమే కాకుండా ఇంగ్లీష్ జట్టులో కూడా యంగ్ ప్లేయర్లు ఉండడంతో సిరీస్ మొత్తం రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
భారత జట్టు ఈసారి మొత్తం యంగ్ ప్లేయర్లతో రంగంలోకి దిగింది. సీనియర్ ఆటగాళ్లు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. గతంలో జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఈసారి లేరు. సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కింది..గిల్ నాయకత్వానికి ఇది లిట్మస్ టెస్ట్ కావడంతో.. జట్టుకూర్పు విషయంలో మేనేజ్మెంట్ అనేకరకాల కసరత్తులు చేస్తోంది. అయితే బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో పెద్దగా ఇబ్బందు లేకపోయినప్పటికీ.. ఆల్ రౌండర్ కోటాలోనే ఇద్దరు ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: Nitish Kumar Reddy : నితీష్ భాయ్.. ఇదా ఆట.. ఇదేనా నీ ఆట..
ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే..
భారత జట్టు లో ప్రస్తుతం యువ ఆటగాళ్ల సందడి ఎక్కువగా ఉంది. అన్ని ఫార్మాట్ లలోనూ యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆల్ రౌండర్ స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వారిలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, మరో ఆటగాడు శార్దూల్ ఠాకూర్. వీరిద్దరూ సమర్థవంతులే కావడంతో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కంగారు జట్టుతో జరిగిన సిరీస్ లో శార్దుల్ కు చోటు లభించలేదు. ఆ సమయంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. అతడు మెల్ బోర్న్ మైదానంలో శతకం సాధించాడు. అయితే బంతితో మాత్రం అతడు ఆకట్టుకోలేకపోయాడు. పరుగులను కంట్రోల్ చేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లీష్ గడ్డపై ఆకట్టుకుంటాడా? అనే సందేహం వ్యక్తం అవుతుంది. గాయం నుంచి క్యూర్ అయినప్పటికీ నితీష్ సామర్థ్యం పై ఇప్పటికీ అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక 2023 డిసెంబర్లో ప్రోటీస్ జట్టుతో జరిగిన టెస్ట్ తర్వాత శారీరక సామర్ద్య ఇబ్బందులతో శార్దూల్ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు అతడు మెల్లమెల్లగా కోరుకుంటున్నాడు. ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. మళ్లీ జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. ఇతడికి ఆంగ్ల గడ్డమీద ఆడిన అనుభవం ఉంది. అంతేకాదు గొప్ప గొప్ప భాగస్వామ్యాలను విడదీసిన రికార్డు కూడా ఉంది. బ్యాట్ తో కూడా ఇతడు ఆకట్టుకోగలడు. అంతేకాదు ప్రాక్టీస్ మ్యాచ్లో ఏకంగా శతకం కొట్టి సంచలనం సృష్టించాడు. ఇద్దరూ మేటి ఆటగాళ్లు కావడంతో ఎవరి వైపు గిల్, గంభీర్ మొగ్గు చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.