India England Tests: టి20 రాజ్యమేలుతోంది. వన్డే ఫార్మాట్ అదరగొడుతోంది. ఇలాంటి సందర్భంలో సుదీర్ఘ ఫార్మాట్ ను ఎవరైనా చూస్తారా? ఒకవేళ ఐసీసీ నిర్వహించినప్పటికీ.. జనాలకు చూసే ఆసక్తి ఉంటుందా? ఈ ప్రశ్నలకు మొన్నటి వరకు సమాధానం ఉండేది కాదు. కానీ అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ ద్వారా అద్భుతమైన సమాధానం లభించింది.
Also Read: క్రికెట్ లో సంచలనం.. ఐదు బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు
ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా సఫారీ – కంగారు జట్లు తలపడ్డాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో వ్యూస్ పరంగా అద్భుతమైన రికార్డులు సొంతమవుతాయని.. సరికొత్త చరిత్ర సాధ్యమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మ్యాచ్ ను కొంతమంది మాత్రమే చూశారు. ఐసీసీకి ఈ మ్యాచ్ ద్వారా ఆదాయం భారీగానే వచ్చినప్పటికీ.. ఊహించిన స్థాయిలో మాత్రం వీక్షణాలు సొంతం చేసుకోలేదు.. అయితే డబ్ల్యూటీసి రికార్డును మాత్రం అండర్సన్ టెడుల్కర్ సిరీస్ బద్దలు కొట్టింది. వ్యూస్ పరంగా సరికొత్త చరిత్రను సృష్టించింది.
డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్ గా అండర్సన్ టెండూల్కర్ సిరీస్ నిలిచింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను జియో హాట్ స్టార్ లో 17 కోట్ల మంది వీక్షించారు. ఇక ఐదవ టెస్టు చివరి రోజున మాత్రం రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. ఈ సిరీస్ మొత్తం 65 బిలియన్ మినిట్స్ వాచ్ టైం నమోదయింది.
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమ్ ఇండియా రెండు, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. వాస్తవానికి లార్డ్స్ లో కూడా టీమిండియా కనుక గెలిచి ఉంటే సిరీస్ సొంతం అయ్యేది. లార్డ్స్ ఓటమి తర్వాత టీమిండియా రెచ్చిపోయింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. మరో మ్యాచ్ లో ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. తద్వారా ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. టీమిండియాను ఓడించి టెస్ట్ సిరీస్ గెలుచుకోవాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది.
Also Read: క్లీన్ స్వీప్ నుంచి రికార్డులు బద్దలు కొట్టేదాకా.. టీమిండియా యంగ్ ప్లేయర్ల ప్రస్థానం సాగిందిలా..
అండర్సన్ సిరీస్ డ్రా అవ్వడంతో డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఈ జాబితాలో కంగారు జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక రెండవ స్థానంలో ఉంది. భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ టీమిండియా ఈ టెస్ట్ సిరీస్ గనుక సాధించి ఉంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని ఆక్రమించేది. తద్వారా మరింత ఆశావాహ దృక్పథంతో మిగతా సిరీస్ లను ఆడేది. యువ జట్టు అయినప్పటికీ గిల్ నాయకత్వంలో ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ చూపించారు. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టుకు వారి సొంత దేశంలోనే చుక్కలు చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అదరగొట్టారు. ఇక ఫీలింగ్ లో అయితే సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఇండియా ఈ స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తుందని ఇంగ్లాండ్ జట్టు కలలో కూడా ఊహించి ఉండదు.