ENG vs IND: ఇంగ్లీష్ గడ్డమీద టెస్ట్ సిరీస్ మరికొద్ది క్షణాల్లో మొదలుకానుంది. గిల్ ఆధ్వర్యంలోని భారత యువ జట్టు ఆంగ్లేయులతో తలపడనుంది. ఇప్పటికే టాస్ ప్రక్రియ పూర్తయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు సారథి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మైదానంలో భారత ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగానే ఉంది. ఏడు టెస్టులు ఆడినప్పటికీ.. రెండు విజయాలు మాత్రమే భారత్ సాధించింది. దీంతో ఈ పిచ్ పై భారత జట్టును ఇబ్బంది పెట్టడానికి ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానం మీద తేమ వుండడం.. పచ్చిక కూడా ఎక్కువగా కనిపిస్తుండడంతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చని ఇంగ్లాండ్ సారథి అభిప్రాయపడ్డాడు. అందులో భాగంగానే అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు.. వోక్స్, కార్స్, టాంగ్, బషీర్ బౌలింగ్ దళం లో కీలకంగా ఉన్నారు. వీరు భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తారని ఇంగ్లాండ్ సారధి అంచనా వేశాడు. టాస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదే విషయాన్ని రవి శాస్త్రి తో కూడా వెల్లడించాడు. పిచ్ అనుకూలంగా ఉందని.. ఇక్కడ తమకు గొప్ప రికార్డులు ఉన్నాయని.. పర్యాటక జట్టును తమ ఇబ్బంది పెడతామని ఇంగ్లాండ్ సారథి ఆశాభావం వ్యక్తం చేశాడు.
Also Read: Nitish Kumar Reddy : నితీష్ భాయ్.. ఇదా ఆట.. ఇదేనా నీ ఆట..
తెలుగోడికి నో ఛాన్స్
అందరూ ఊహించినట్టుగానే ఈ మ్యాచ్లో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ లభించలేదు. ఇటీవల కంగారు జట్టుతో జరిగిన సిరీస్ లో అతడు సెంచరీ చేసినప్పటికీ.. ఈ మ్యాచ్లో అతడికి అవకాశం లభించలేదు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నారు. శార్దుల్ ఠాకూర్ ను ఆల్ రౌండర్ కేటగిరిలో జట్టులోకి తీసుకున్నారు. ఇటీవలి కంగారు జట్టు తో జరిగిన సిరీస్లో శతకంతో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నప్పటికీ.. బంతితో మాత్రం అదరగొట్టలేకపోయాడు. పరుగులను నియంత్రించినప్పటికీ.. వికెట్లు పడగొట్టలేకపోయాడు. మరోవైపు శార్దుల్ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ గడ్డమీద అతడికి మెరుగైన రికార్డు ఉంది. బ్యాట్ తో కూడా అతడు రాణించగలడు. ఇంగ్లీష్ గడ్డ మీద అతడు ఏకంగా పది వికెట్లు సాధించాడు. దీంతో అతని వైపు కెప్టెన్ గిల్ ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. ” శార్దూల్ ఠాకూర్ ను ఆల్ రౌండర్ కేటగిరిలో జట్టులోకి తీసుకున్నాం.. అతడికి ఇంగ్లీష్ గడ్డమీద మెరుగైన రికార్డు ఉంది. ప్రస్తుత పర్యటనలో అతడు అదే తీరుగా ప్రదర్శన చేస్తాడని ఆశాభావంతో ఉన్నాం. అందువల్లే అతడిని తుది జట్టులోకి తీసుకున్నాం. చాలా రోజుల తర్వాత అతడు జట్టులోకి వచ్చాడు. తన ఆగమనాన్ని గట్టిగా చాటుకుంటాడని నమ్ముతున్నామని” భారత సారథి గిల్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతున్నట్లు గిల్ వివరించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. భారత బ్యాటర్లు వారిని ఏ విధంగా అధిగమిస్తారు.. ఏ స్థాయిలో పరుగులు చేస్తారు అనేది చూడాల్సి ఉంది.