Cricket Journey Team India: ఓటమి పదేపదే పలకరిస్తుంది. విజయం దక్కేదాకా వెంటపడుతుంది. ఒక్కసారి విజయం దక్కితే ఓటమి దరిదాపుల్లో కూడా ఉండదు. కాకపోతే విజయం సాధించాలంటే అంత ఈజీ కాదు. ఓటమి కుంగుబాటుకు కారణం అవుతుంది. నిర్వేదానికి బీజం వేస్తుంది. నిరాసక్తతకు నిదర్శనంగా ఉంటుంది. కానీ ఒక్కసారి విజయం సాధిస్తే అవన్నీ దూరం అవుతాయి. విజయం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో.. ఓటమి అంతకుమించిన గుణపాఠం నేర్పుతుంది. అటువంటిదే ఈ క్రికెటర్ జీవితంలో జరిగింది.
Also Read: అలా అవుట్ అయిన ఒకే ఒక్క క్రికెటర్.. లెజెండ్ కెరీర్‌లో అదీ ఓ రికార్డే!
టీమిండియా ఇంగ్లాండ్ సిరీస్ ను డ్రా చేసుకొని ఉండవచ్చు. అద్భుతమైన పోరాటపటిమను చూపించవచ్చు. అయితే ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. టీమిండియా టెస్ట్ ఫార్మాట్ కు అద్భుతమైన ఓపెనర్ దక్కాడు. దక్కడం మాత్రమే కాదు ఆస్థానంలో మరొక ఆటగాడిని ఊహించుకోలేకుండా చేశాడు. అతడే యశస్వి జైస్వాల్. యశస్వి సొంత గ్రామం ఉత్తర ప్రదేశ్ లోని సూరియావాన్. ఇక్కడ తండ్రి హార్డ్వేర్ షాపులో పనిచేస్తాడు. తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటుంది. యశస్వికి మొత్తం ఐదుగురు తోబుట్టువులు. ఇతడు నాలుగో వాడు. పిల్లలకు అన్నం పెట్టడానికి యశస్వి తల్లిదండ్రులు పస్తులు ఉన్న రోజులు చాలా ఉన్నాయి. కేవలం మంచినీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.. అమ్మానాన్నల కష్టాలను చూసి ఏదైనా చేయాలని జైస్వాల్ చిన్నప్పుడే అనుకున్నాడు. అలా గల్లీలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. చిన్నప్పటినుంచి అతడికి చాలా ఇష్టం. రాముడు చిత్రాన్ని హనుమంతుడు తన గుండెలో దాచుకున్నట్టు.. సచిన్ చిత్రాన్ని తన హృదయంలో నింపుకున్నాడు జైస్వాల్. అయితే జైస్వాల్ క్రికెట్ ఆడటం అతడి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తన తండ్రిని నెలల కొద్దీ బతిమిలాడి ముంబై వెళ్లాడు.
అక్కడ మైదానంలో క్రికెట్ నేర్చుకోవడానికి అంతా బాగానే ఉన్నప్పటికీ.. వసతి లేకపోవడంతో జైస్వాల్ నరకం చూశాడు. దగ్గర బంధువుల ఇంట్లో కొద్దిరోజులు ఉన్న జైస్వాల్… ఆ తర్వాత తన బంధువు అసలు రూపం చూపించడంతో తట్టుకోలేకపోయాడు. పైగా జైస్వాల్ ను అతడి బంధువు ఒక డెయిరీలో పనికి కుదిర్చాడు. అయితే పగటిపూట అక్కడున్న పిల్లలతో జైస్వాల్ క్రికెట్ సాధన చేసేవాడు. అది డెయిరీ ఫాం యజమానికి నచ్చేది కాదు. దీంతో అతడిని బయటికి పంపించాడు. ఇదే సమయంలో జైస్వాల్ నడుచుకుంటూ ముంబైలోని ఆజాద్ మైదానానికి వెళ్ళాడు. అక్కడ ఫుట్పాత్ మీద పడుకున్నాడు. అతడి వాలకాన్ని చూసిన ఓ పానీ పూరి బండి యజమాని ఒక గోల్ గప్పా ప్యాకెట్ ఇచ్చాడు. దానితో ఆకలి తీర్చుకున్నాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్న పిల్లలు క్రికెట్ ఆడుతుంటే.. వారితో ఆడేవాడు. అయితే జైస్వాల్ ఆట తీరు చూసిన ఒక వ్యక్తి అధికారులతో మాట్లాడాడు. ఆ మైదానంలో సాధన చేస్తూ.. పానీపూరి బండి వద్ద పనిచేస్తూ.. మెల్లి మెల్లిగా తన ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు జైస్వాల్.
Also Read:ఆంధ్రా ప్రీమియర్ లీగ్ షురూ.. టీంలు ఇవీ.. యువతకు పండుగ
ఇదే సమయంలో కోచ్ జ్వాలా సింగ్ గమనించి.. సొంత డబ్బుతో ఇంగ్లీష్ నేర్పించాడు. మంచి భోజనం పెట్టించాడు.. జ్వాల సింగ్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని జైస్వాల్ వమ్ము చేయలేదు. 2015లో ఒక స్కూలు జట్టు తరఫున ఆడి 319 పరుగులు చేశాడు. 13 వికెట్లు సాధించాడు. ముంబై అండర్ 16 లో అద్భుతంగా ఆడాడు. ఇండియా అండర్ 19 జట్టుకు ఎంపిక అయ్యాడు. 2018 లో జరిగిన ఆసియా కప్ ను టీమిండియా కు అందించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. 2020లో ఐపీఎల్ లో కి ప్రవేశించాడు. రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు.. క్రమక్రమంగా తన ఆటకు మెరుగులు అద్దుకుంటూ ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ గా అవతరించాడు. అంతేకాదు పరుగుల వరద పారిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.