Rain Warning Andhra: ఏపీకి ( Andhra Pradesh) భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చేవారం రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలతో వర్షాలు పడతాయని చెబుతోంది అమరావతిలోని వాతావరణ కేంద్రం. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో సైతం వర్షపాతం నమోదు వస్తోంది. అయితే రేపటి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అదే జరిగితే ఏపీలో ఖరీఫ్ కు పుష్కలంగా సాగునీరు లభించే అవకాశం ఉంది. ఖరీఫ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాల కదలిక ప్రారంభం కావడంతో.. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 13న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: అల్పపీడనం…విజయవాడకు ఎల్లో అలెర్ట్..
ఈరోజు ఆ జిల్లాల్లో..
ప్రధానంగా ఈరోజు పార్వతీపురం మన్యం( parvatipuram manyam ), అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తున్నారు.
భిన్న వాతావరణ పరిస్థితులు
మరోవైపు ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. శనివారం గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో 36 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇంకోవైపు వైయస్సార్ కడప,కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ,కర్నూలు, ఎన్టీఆర్, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా వైయస్సార్ కడప జిల్లా ఎగువ కల్వట్లలో ఏకంగా 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Also Read: ఏపీలో ఏంటీ విలయం!
రుతుపవనాల్లో కదలిక..
సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు తాకడంతో అల్పపీడనాల ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. వర్షాల జాడ లేకుండా పోయింది. దీంతో జూన్, జూలై నెలలో వర్షపాతం లోటు ఏర్పడింది. ఆగస్టులో సైతం అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటువంటి సమయంలో మళ్లీ రుతుపవనాల కదలిక ప్రారంభం అయింది. దీంతో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.