Chennai Super Kings: ఐపీఎల్ 2025 సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈసారి బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. పంజాబ్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. 2025 సీజన్లో ఎన్నో అంచనాలతో రంగంలోకి దిగిన చెన్నై జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. ధోని నాయకత్వంలో కూడా ఆ జట్టు ఆశించినంత స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో అధమ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు 2026 సీజన్లో ఎలాగైనా సరే విజేతగా నిలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే 2026 సీజన్ కు కసరత్తు మొదలుపెట్టింది.
2026 సీజన్లో చెన్నై జట్టు అనేక ప్రణాళికలతో సిద్ధంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2025 సీజన్ చెన్నై జట్టుకు పీడ కలలాగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అలాంటి తప్పును మరోసారి పునరావృతం చేయకూడదని చెన్నై జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలను రూపొందించింది. 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై జట్టు పలువురు ప్లేయర్లను బయటికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టుకు భారంగా మిగిలిన దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాటి, సామ్ కరణ్, కాన్వే వంటివారిని వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై జట్టు నుంచి అశ్విన్ రిటైర్ కావడంతో ఆ జట్టు పర్స్ లో 9.75 కోట్లు ఉన్నాయి.
చెన్నై జట్టు ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఐదుసార్లు కూడా ధోని నాయకత్వంలోనే చెన్నై జట్టు ఈ ఘనత అందుకుంది. ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ జట్టు సారధ్య బాధ్యతలను స్వీకరించాడు. కానీ అతడు అనుకున్న స్థాయిలో జట్టును నడపలేక పోతున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీనికి తోడు గాయం కావడంతో అతడు మధ్యలోనే జట్టును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో ధోనికి చెన్నై యాజమాన్యం మళ్లీ తాత్కాలిక కెప్టెన్సీ అప్పగించింది. అయినప్పటికీ ఆ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. జట్టులో ఉన్న ప్లేయర్లపై ధోని పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ఎలాగైనా సరే మునుపటి వాడిని చూపించాలని చెన్నై జట్టు భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే యాజమాన్యం కసరత్తు మొదలు పెట్టింది. మినీ వేలంకంటే ముందే కొంతమంది ఆటగాళ్లను బయటికి పంపించాలనే నిర్ణయంతో ఉంది. అందువల్లే సరిగా ఆడని ప్లేయర్లను దూరం పెట్టాలని డిసైడ్ అయింది. అయితే ముగ్గురు ప్లేయర్లతోనే ఆగిపోతుందా.. ఇంకా కొంతమంది ప్లేయర్ల పై వేటు వేస్తుందా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.