Vangaveeti Radha Krishna: ఉమ్మడి ఏపీలో వంగవీటి కుటుంబానికి ఘనమైన చరిత్ర. వంగవీటి మోహన్ రంగా ఒక చరిత్ర సృష్టించారు. ప్రజా సంఘాల నాయకుడిగా విజయవాడలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అయ్యింది ఒక్కసారి మాత్రమే అయినా.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచారు. అందుకే ఆయన చనిపోయి మూడున్నర దశాబ్దాలు అయినా ఆయన మాత్రం తెలుగు రాజకీయాల్లో సజీవంగా ఉన్నారు. అయితే ఆయన పేరుతో రాజకీయ పార్టీలు లబ్ది పొందుతున్నాయి తప్ప.. ఆయన వారసుడు వంగవీటి రాధాకృష్ణ మాత్రం లాభపడింది తక్కువ. దానికి ఆయన స్వయంకృతాపరాధం ఉంది. మనం తీసుకునే నిర్ణయాలు.. అనుసరించే వ్యూహం బట్టి రాజకీయాల్లో రాణింపు ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఆయన తొందరపాటు చర్యలే ఆయనకు ఈ పరిస్థితికి తెచ్చిపెట్టాయి.
* చిన్న వయసులోనే అసెంబ్లీకి..
2004లో విద్యార్థి దశలో ఉన్నారు వంగవీటి రాధాకృష్ణ. ఆ సమయంలో పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి. వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా గుర్తించి రాధాకృష్ణను ప్రోత్సహించారు. ఏకంగా అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ 3 పదుల వయసు లోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే 2009లో ఆయన చేసిన తప్పిదం శాపంగా మారింది. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోయారు రాధాకృష్ణ. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినలేదు. ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అదే ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ తరపున గెలిచి ఉంటే తప్పకుండా వంగవీటి రాధాకృష్ణ మంత్రి అయ్యేవారు. ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగేవారు.
* కలిసిరాని అదృష్టం
అయితే అదే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన వేళ చాలా బాధపడ్డారు రాధాకృష్ణ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. వైసీపీ సైతం అధికారంలోకి రాలేదు. కనీసం రాధాకృష్ణకు గుర్తింపు దక్కలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ లభించలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు రాధాకృష్ణ. అది మొదలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి తరుపున ప్రచారం చేశారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్ రాధాకృష్ణకు మంచి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు స్నేహితుల రూపంలో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
* ఒకే ఫ్రేమ్ లోకి ముగ్గురు..
వైసిపి హయాంలో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. వారిద్దరి ప్రవర్తన పై వైసీపీలో సైతం అభ్యంతరాలు ఉన్నాయి. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రాధాకృష్ణను ఆ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. అయితే ఇప్పుడు రాధాకృష్ణకు మంచి అవకాశాలు దక్కే పరిస్థితి ఉన్న నేపథ్యంలో.. స్నేహం పేరిట వల్లభనేని వంశీతో పాటు నాని ఆయనను కలవడానికి టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ హయాంలో అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వ్యక్తులతో వంగవీటి రాధాకృష్ణ ఎలా కలుస్తారని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒకవైపు రాధాకృష్ణ రాజకీయ ఎదుగుదలకు సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. తన కెరీర్ కు ఇబ్బంది కలిగించే స్నేహాన్ని దూరం పెట్టడమే మేలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు అని అనవచ్చు. కానీ విపరీతమైన ధోరణిలతో వ్యవహరించే అటువంటి వారికి దూరంగా ఉండడం చాలా మేలు. ఈ కారణంతో వంగవీటి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వంలో పదవి దక్కదు అని చెప్పలేము కానీ.. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు చాలామంది ఉంటారు. ఇక తెలుసుకోవాల్సింది వంగవీటి రాధాకృష్ణ.