Childrens day 2024: బాల్యం చాలా విలువైనది. ఆ రోజుల్లో అల్లరి, చిలిపి పనులు జీవిత కాలం గుర్తుండి పోతాయి. ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా ఓ మధురానుభూతిని అనుభవిస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ముఖ్యం. అలాంటి బాలల దినోత్సవాన్ని మన దేశంలో నవంబర్ 14న జరుపుకుంటాం.. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఆ రోజున ఆయనకు నివాళులు అర్పించి పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. నెహ్రూకు పిల్లలంటే, గులాబీలంటే చాలా ఇష్టం. నెహ్రూ పిల్లలను దేశ సంపద అని పిలిచేవారు. అంతేకాదు, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నెహ్రూ తన జీవితంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపారు. ఆ సమయంలో తన కూతురు ఇందిరాతో ఎక్కువ సమయం గడపలేదు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో గడిపేవాడు. నేటి పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్తు అని ఆయన బలంగా నమ్మారు. పిల్లల కోసం ఏదైనా చేయాలని నిరంతరం శ్రమించేవాడు. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించాడు. పిల్లల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టిన రోజును బాలల పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు నెహ్రూ జ్ఞాపకార్థం చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బాలల దినోత్సవ వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయో.. ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం నెహ్రూ మరణానికి 10 సంవత్సరాల ముందు నుంచే ప్రారంభమైంది. భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం 1956లో ప్రారంభమైంది. అప్పట్లో దీనిని ‘బాలల దినోత్సవం’ అని పిలవలేదు.. కానీ ‘బాల సంక్షేమ దినోత్సవం’గా జరుపుకునేవారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం పిల్లల పట్ల అవగాహన కల్పించడం, వారి హక్కులను పరిరక్షించడం. 1956లో భారత ప్రభుత్వం బాలల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నవంబర్ 14న ‘బాల సంక్షేమ దినోత్సవం’ జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే, జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలను చాలా ప్రేమిస్తారు. ఆయనను ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారు. పిల్లల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం నవంబర్ 14న ‘బాలల దినోత్సవం’ జరుపుకోవాలని నిర్ణయించారు.
బాలల దినోత్సవం ఎందుకు ముఖ్యమైనది?
బాలల దినోత్సవం భారతదేశంలో బాలల హక్కులు, సంక్షేమం గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక రోజు. ఈ రోజు పిల్లల కోసం క్రీడలు, నాటకం, సంగీతం మొదలైన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలకు వారి హక్కుల గురించి తెలియజేయడంతోపాటు వారు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణనిస్తారు. బాలల దినోత్సవం సమాజంలో పిల్లల పట్ల అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. ఈ రోజున ప్రజలు పిల్లల సమస్యలపై చర్చిస్తారు.
నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలను ఎంతో ప్రేమించేవారు. పిల్లల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నవంబర్ 14ని చైల్డ్ వెల్ఫేర్ డేగా జరుపుకోవడం 1956 నుండి ప్రారంభమైంది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల పిల్లల పట్ల అవగాహన పెరుగుతుంది. పిల్లల సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రజలు చైతన్యం పొందుతారు.