SRH: నిరుడు పదో స్థానం.. ఇప్పుడు కప్ కోసం అడుగు దూరం.. SRH ఘనతకు కారణం అతడే..

శుక్రవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాలలో హైదరాబాద్ సత్తా చాటింది. 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని, రాజస్థాన్ జట్టును మట్టికరిపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 5:09 pm

SRH

Follow us on

SRH: భీకరమైన బ్యాటర్లు.. భయంకరమైన బౌలర్లు.. అదరగొట్టే ఫీల్డర్లు.. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు 2017 నుంచి 2023 వరకు ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో ఈసారి ఆడే జట్టు ఓడిపోయేది కాదు.. కప్ గెలిచేది కావాలని కావ్య మారన్ పట్టుబట్టి కెప్టెన్ ను మార్చింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి కమిన్స్ ను నియమించుకుంది. ఫలితంగా హైదరాబాద్ జట్టు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆట తీరు పూర్తిగా చేంజ్ అయింది. దీంతో ఆ జట్టు అద్భుతమైన విజయాలు సాధించి, ఫైనల్ దూసుకెళ్లింది.. ప్లే ఆఫ్ లో కోల్ కతా చేతిలో ఓడిపోయినప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచిన కారణంగా, మరో అవకాశాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ పై గెలిచి, ఫైనల్ దూసుకెళ్లింది. 36 పరుగుల తేడాతో విజయం సాధించి, కప్ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

శుక్రవారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాలలో హైదరాబాద్ సత్తా చాటింది. 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని, రాజస్థాన్ జట్టును మట్టికరిపించింది. మందకొడిగా మారిన మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో హైదరాబాద్ స్కోర్ 175 కే పరిమితమైంది. క్లాసెన్ 50, రాహుల్ త్రిపాఠి 37, ట్రావిస్ హెడ్ 34 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3, బౌల్ట్ 3 వికెట్లు తీశారు. సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.

175 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 రన్స్ కే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ 56*, యశస్వి జైస్వాల్ 42 మాత్రమే రాణించారు. మిగతా వారంతా వెంట వెంటనే అవుట్ కావడంతో, రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. మందకొడిగా ఉన్న మైదానంపై హైదరాబాద్ బౌలర్లు శాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టారు.. నటరాజన్ ఒకటి, కమిన్స్ ఒక వికెట్ తీశారు.

హైదరాబాద్ ఈ స్థాయిలో రాణించడం వెనక కెప్టెన్ కమిన్స్ కృషి తీవ్రంగా ఉంది. అతడు జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు. కోల్ కతా చేతిలో ఓటమి ఎదురైన నేపథ్యంలో.. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సరైన ప్రణాళికలు అమలు చేశాడు. వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. ఉదాహరణకు షాబాజ్ అహ్మద్ కు తోడుగా అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించిన కమిన్స్.. రాజస్థాన్ టాప్ ఆర్డర్ పని పట్టాడు. అప్పటికి యశస్వి జైస్వాల్ భువనేశ్వర్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. మైదానంపై పేస్ బౌలింగ్ వేయడం కుదరని భావించి.. వెంటనే అభిషేక్ శర్మ, షాబాద్ అహ్మద్ కు బౌలింగ్ ఇచ్చాడు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. కీలకమైన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ గెలిచిందంటే దానికి కమిన్స్ తీసుకున్న బౌలింగ్ నిర్ణయం కారణమని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక కెప్టెన్ గా మాత్రమే కాకుండా బౌలర్ గానూ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో ఏకంగా 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసుకున్న రెండవ కెప్టెన్ గా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో షైన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా ఉన్న షైన్ వార్న్ 19 రికార్డులు పడగొట్టాడు. అతని తర్వాత కమిన్స్ (17 వికెట్లు, హైదరాబాద్ 2024), అనిల్ కుంబ్లే(17 వికెట్లు ఆర్సిబి 2010), రవిచంద్రన్ అశ్విన్ (15 వికెట్లు: పంజాబ్ కింగ్స్ 2019), షైన్ వార్న్(14 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ 2009) ఉన్నారు.