AP Police: ఏపీ ఎన్నికల్లో ఈసారి అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసింది. సోషల్ మీడియా ద్వారా జనసేన అధినేత పవన్ కు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్ప కిషోర్ రవిచంద్రారెడ్డికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. సతీ సమేతంగా నంద్యాల వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో.. ముందస్తు అనుమతులు లేకుండా అల్లు అర్జున్ వెళ్లడంతో పోలీసు కేసులు నమోదయ్యాయి. భారీగా జనం తరలి రావడంపై ఈసీ సీరియస్ అయింది. బాధ్యులైన అధికారులపై చర్యలకు ఆదేశించింది. తాజాగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడింది.
ఈనెల 11న ఎన్నికల ప్రచారంలో చివరి రోజు.. అల్లు అర్జున్ తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్ప కిషోర్ రవిచంద్ర రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ పర్యటనను వైసీపీ రాజకీయంగా వాడుకుంది. భారీగా జన సమీకరణ చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. దీంతో అల్లు అర్జున్ తో పాటు శిల్ప కిషోర్ రవిచంద్ర రెడ్డి పై కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఎస్పి రఘువీరారెడ్డి తో పాటు డిఎస్పి, సీఐలపై చర్యలకు ఉపక్రమించింది. చార్జ్ సీట్ ఓపెన్ చేయాలని రాష్ట్ర డిజిపి కి ఆదేశాలు ఇచ్చింది.
అయితే తాజాగా ఇద్దరు కానిస్టేబుల్ పై జిల్లా పోలీస్ శాఖ వేటు వేసింది. వారికి విఆర్ కు పంపిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని అందించడంలో విఫలమైన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నాగరాజు, స్వామి నాయకులను విఆర్ కు పంపిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఒకవైపు రాజకీయ ప్రకంపనలు రేపగా.. మరోవైపు పోలీస్ శాఖను సైతం కుదిపేసింది. అయితే ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఎపిసోడ్ మాత్రం ప్రత్యేకంగా నిలవనుంది.