Cameron Green Health Issue: ఇటీవల ఐపీఎల్ మినీ వేలం జరిగినప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ ను 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతని గురించి చర్చ మొదలైంది. అంతేకాదు యాషెస్ సిరీస్లో మూడో టెస్టులో అతడు సున్నా పరులకు అవుట్ అయ్యాడు. ఫలితంగా అతడు ఐపీఎల్లో అదరగొడతాడా? షారుక్ ఖాన్ 25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఆ డబ్బుకు న్యాయం చేస్తారా? అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి. అయితే ఇప్పుడు గ్రీన్ కు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
గ్రీన్ ఐపీఎల్ వేలంలో రెండు కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు.. అతని కోసం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి కోల్ కతా అతనిని దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనత అందుకున్న మూడవ ఆటగాడిగా నిలిచాడు.
2023లో 17.5 0 కోట్లకు అతడిని ముంబై జట్టు కొనుగోలు చేసింది. ఆ తర్వాత బెంగళూరుకు జట్టు కు అతడు ట్రేడ్ అయ్యాడు. అయితే గ్రీన్ మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని అతను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం పేర్కొన్నాడు.. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ” నేను తల్లి గర్భంలో నుంచి పుట్టిన తర్వాత కిడ్నీ వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు.. అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా నాకు ఆ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. నా కిడ్నీలు మిగతా వారి మాదిరిగా రక్తాన్ని శుద్ధి చేయలేవు. అవి 60% మాత్రమే పనిచేస్తాయి. వాటిని సరిగా చూడకపోతే పూర్తిగా పాడవుతాయి. ప్రస్తుతం నా పరిస్థితి మెరుగ్గానే ఉంది. నేను మిగతా వారి మాదిరిగా శారీరకంగా పెద్దగా దెబ్బ తినలేదు. నా ఆరోగ్య సమస్య గురించి జట్టులో చాలామందికి తెలుసు. అందువల్లే ఆహారపు అలవాట్లను నిత్యం కంట్రోల్లో ఉంచుకుంటానని” గ్రీన్ అప్పట్లో పేర్కొన్నాడు.
గ్రీన్ తల్లి పేరు తార్సీ. గ్రీన్ కడుపులో ఉన్నప్పుడు ఈ వ్యాధి విషయం బయటపడింది.. అంతేకాదు అతడు పుట్టిన తర్వాత 12 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడని తేలింది. అయితే మృత్యువును జయించిన గ్రీన్.. ప్రస్తుతం క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అంతేకాదు 2026 ఐపీఎల్ లో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు.. ఐపీఎల్ లో గ్రీన్ ఇప్పటివరకు 29 మ్యాచులు ఆడాడు.. 41.6 సరాసరి, 153.7 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 707 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 9.08 ఎకానమీతో 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.