IND VS AUS 4th Test : ఇలా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెంట వెంటనే పెవిలియన్ వెళ్ళిపోవడంతో.. సగటు టీమిండియా అభిమాని సంబరాలు చేసుకున్నాడు. కానీ అలా చేతులెత్తేస్తే అది ఆస్ట్రేలియా ఎందుకవుతుంది.. వెంట వెంటనే వికెట్లు పడుతున్నా లబూ షేన్ ఒంటరి పోరాటం చేశాడు.. 70 పరుగులు చేసి.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు కెప్టెన్ కమిన్స్ తో కలిసి ఏడో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీళ్ళిద్దరి జోడిని విడదీసిన తర్వాత.. టీమిండియా కు స్టార్క్ మిగతా వికెట్ పడగొట్టడం సులభమే అయినప్పటికీ.. చివరి వికెట్ తీయడం మాత్రం అంత ఈజీ కాలేదు. బోలాండ్, లయన్ క్రీజ్ లో అలా పాతుకుపోయారు. జిడ్డు ఆట ఆడుతూ టీమ్ ఇండియా బౌలర్లను తీవ్రంగా విసిగించారు. పదో వికెట్ కు ఏకంగా 55 పరుగులు జోడించారు. బుమ్రా కు లొంగకుండా.. సిరాజ్ కు చిక్కకుండా.. రవీంద్ర జడేజా ఉచ్చులో పడకుండా.. నితీష్ కుమార్ రెడ్డి వలలో పడకుండా.. ఆకాష్ దీప్ ఆకర్షణకు గురి కాకుండా ఆడారు.. వీరిద్దరే దాదాపు 119 బంతులను ఎదుర్కొన్నారు అంటే ఎలాంటి టెస్ట్ క్రికెట్ ఆడారో అర్థం చేసుకోవచ్చు.
టీమ్ ఇండియాకు స్ట్రోక్
మెల్ బోర్న్ మైదానంలో శనివారం ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. ఆదివారం లంచ్ బ్రేక్ వరకు పై చేయి సాధించిన టీమ్ ఇండియాకు లయన్, బోలాండ్ స్ట్రోక్ ఇచ్చారు. చివరి వికెట్ అంత సులభంగా వదిలిపెట్టకుండా 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా లీడ్ 333 పరుగులకు పెంచారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను అవుట్ చేయడంలో పోటీపడిన టీమిండియా బౌలర్లు.. బోలాండ్, లయన్ ముందు మాత్రం తేలిపోయారు. ఎంత పదునైన బంతులు వేసినా లయన్ అత్యంత చాకచక్యంగా కాచుకున్నాడు. ఇక బోలాండ్ అయితే క్రీజ్ నుంచి పాదం బయట పెట్టకుండా ఆడాడు. ఏ ఒక్క బంతిని కూడా వదిలిపెట్టకుండా డిఫెన్స్ ఆడాడు. హాఫ్ స్టంప్ బంతులను అలానే వదిలేశాడు. సింగిల్ వస్తుంది అనుకుంటే మాత్రమే బ్యాట్ తో టచ్ చేశాడు. ఇక లయన్ అయితే ఈ ఇన్నింగ్స్ లో మూడో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 54 బాల్స్ ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్ల సహాయంతో 41 రన్స్ చేశాడు. బోలాండ్ 65 బంతులు ఎదుర్కొని ఒకే ఒక ఫోర్ తో పది పరుగులు చేశాడు. చివరి వికెట్ గా వచ్చిన వీరిద్దరూ 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారంటే ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు. అయితే సోమవారం నాటి మ్యాచ్లో వీరిద్దరిని త్వరగా అవుట్ చేస్తేనే టీమిండియా విజయవకాశాలు మెల్ బోర్న్ మైదానంలో ఆధారపడి ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.