Rohit And Virat Kohli: చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్, విరాట్ ఇంతవరకు.. వన్డేలలో కనిపించలేదు. ఐపీఎల్ లో వారిద్దరు ఆడారు. అభిమానులకు అద్భుతమైన క్రికెట్ వినోదాన్ని అందించారు. ఆ తర్వాత వారు మైదానంలో కనిపించింది లేదు. రోహిత్ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నాడు. క్రికెట్ సాధన చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్నాడు.
గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ కు టీమ్ ఇండియాను ఎంపిక చేస్తున్న దశలో రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత అదే బాటను విరాట్ కోహ్లీ కూడా అనుసరించాడు. అటు టి20, ఇటు టెస్ట్ ఫార్మాట్లకు ఇద్దరు వీడ్కోలు పలకడంతో.. వన్డే ఫార్మాట్ లో కొనసాగుతారా? లేదా ఇందులో కూడా తప్పుకుంటారా? అనే ప్రశ్నలు వ్యక్తం అయ్యాయి. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా వారిద్దరు వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడం లేదు. పైగా 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారని తెలుస్తోంది.
ఇక ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం భారత జట్టును ప్రకటించబోతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు వీరిద్దరు జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి వీరిద్దరూ అడుగుపెట్టబోతున్నారు. దీంతో రోకో జోడిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే రోహిత్ శర్మను సారధిగా కొనసాగిస్తారా? గిల్ కు ప్రమోషన్ కల్పిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కు కూడా సారధిగా ప్రమోషన్ కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అయ్యర్ కూడా ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్ లో అదరగొడుతున్నాడు.
ఇటీవల కాలంలో అయ్యర్ కు మేనేజ్మెంట్ అన్యాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో.. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్ లో అయ్యర్ కు జట్టులో చోటు దక్కలేదు. గంభీర్ తో విభేదాల వల్లే ఇదంతా జరుగుతోందని ప్రచారంలో ఉంది. మరి దీనిపై మేనేజ్మెంట్ ఈరోజు ప్రకటించే జట్టు కూర్పు విషయంలో ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాల్సి ఉంది.