IPL Mega Auction 2025: ఇటీవల ఫ్రాంచైజీ జట్లు ఆటగాళ్ల రిటైన్ జాబితాను బీసీసీఐకి అందజేశాయి. దీంతో స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రావడం ఖరారు అయిపోయింది. అయితే వేలానికి సంబంధించిన తేదీని బీసీసీఐ నిన్నటిదాకా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఐపిఎల్ వేలంపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.. నవంబర్ 24, 25 తేదీలలో వేలం నిర్వహించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ తేదీలు ఫైనల్ అవుతాయా? లేకుంటే మారుతాయా? అనేది తేలాల్సి ఉంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో వేలం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి వేలంలో పాల్గొనే ఆటగాళ్లు ఎవరు? ఎవరికి ఏ స్థాయిలో ధర దక్కుతుంది? ఏ జట్టు స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంటుంది? అనే ప్రశ్నలకు వేలం రోజు సమాధానం లభించనుంది.. అయితే ఈసారి జరిగే వేలంలో గత రికార్డులు బద్దలవుతాయని తెలుస్తోంది.
గరిష్టంగా 25 మంది..
ఆయా జట్లు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లతో టీం ను రూపొందించుకుంటాయని తెలుస్తోంది. అందువల్ల వేలం ప్రక్రియ రెండు రోజులపాటు సాగే అవకాశం ఉంది. అయితే ఈసారి జరిగే వేలంలో స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని తెలుస్తోంది. ఫాఫ్ డూ ప్లేసిస్, అర్ష్ దీప్ సింగ్, సామ్ కరణ్, కాగిసో రబాడ, సికిందర్ రజా, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, మహమ్మద్ సిరాజ్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు కూడా భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రిషబ్ పంత్ పై అన్ని జట్లు కన్నేశాయి. అతడు భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల అన్ని జట్లు తమ రిటెన్షన్ ఆటగాల జాబితాను ప్రకటించాయి. కొన్ని జట్లు ఆటగాలను రిటైన్ చేసుకున్నాయి. హైదరాబాద్ జట్టు క్లాసెన్ కు ఏకంగా 23 కోట్లు ఇచ్చింది. బెంగళూరు విరాట్ కోహ్లీని 21 కోట్లతో నిలుపుదల చేసుకుంది. పది జట్లు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇందులో 36 మంది దేశీయ ఆటగాళ్లు కాగా , పదిమంది విదేశీ ఆటగాళ్లు. అన్ని జట్లు ఆటగాళ్ల కోసం ఏకంగా 558.5 కోట్లను ఖర్చు చేశాయి. ఈ మెగా వేలాన్ని జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.. వేలం కార్యక్రమానికి పెద్దపెద్ద కార్పొరేట్ వ్యక్తులు హాజరవుతున్న నేపథ్యంలో.. దానిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి స్టార్ ఆటగాళ్లు వేలంలో ఉన్న నేపథ్యంలో.. భారీ రికార్డులు నమోదు అవుతాయని తెలుస్తోంది.