Bangladesh protests: బంగ్లాదేశ్ లో తగ్గుముఖం పట్టని అల్లర్లు.. టి20 ప్రపంచ కప్ నిర్వహణపై నీలి నీడలు

బంగ్లాదేశ్లో క్రికెట్ కు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఐసీసీ టి20 మహిళా వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్కడ స్టేడియాలను ఆధునికీకరిస్తోంది. అంతేకాదు అక్కడ మరిన్ని మైదానాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 10, 2024 9:12 pm

T20 Women's World Cup

Follow us on

Bangladesh protests: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. అంతకంతకూ అల్లర్లు ఉధృతమవుతున్నాయి. ఏం జరుగుతుందో ఎంతకీ అంతు పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ గొడవలు తగ్గడం లేదు. పైగా ఇప్పటివరకు దేశంలో జరిగిన అల్లర్లలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్రికెటర్లు దేశం విడిచి వెళ్లిపోయారు. వారు ఎక్కడ ఉన్నారో ఇంతవరకు ఆచూకీ లభించలేదు. వారి గృహాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోర్తాజా ఇంటిని చుట్టుముట్టిన నిరసనకారులు .. పలు వస్తువులను ధ్వంసం చేశారు. సమాజంలో పేరుపొందిన వ్యక్తులను సైతం ఆందోళనకారులు వదిలిపెట్టడం లేదు. దీంతో బంగ్లాదేశ్ లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వాస్తులు చాలావరకు ధ్వంసం అయ్యాయి. ప్రైవేట్ ఆస్తులు లూటీ అయ్యాయి. దీంతో ఎటు చూసినా బంగ్లాదేశ్లో విలయమే కనిపిస్తోంది. భద్రత దళాలు రోడ్లపై కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదని అక్కడ మీడియాలో ప్రసారమవుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది.

బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లు ఆ దేశ క్రికెట్ పై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల టి20 ప్రపంచ కప్ నిర్వహించేందుకు ఐసీసీ గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం టి20 వరల్డ్ కప్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టి. బంగ్లాదేశ్లో పలు ప్రాంతాలలో క్రికెట్ మైదానాలకు మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికీ అవి కీలక దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో ఆ పనులు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. దీంతో టోర్నీ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికీ అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో క్రికెట్ వర్గాలలో ఆందోళన మొదలైంది..

బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ప్లేయర్ల భద్రతపై తమకు పూచికత్తు ఇవ్వాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు విన్నవించింది. ఆర్మీ చీఫ్ ఉజ్ జమాన్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. ” దేశంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇలాంటప్పుడు టీ -20 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఎలా నిర్వహించాలి? ప్లేయర్ల భద్రత పై మీరు మాకు హామీ ఇవ్వాలి. అప్పుడే మేము టోర్నీ సక్రమంగా నిర్వహించగలుగుతాం” బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆ దేశ ఆర్మీ చీఫ్ కు రాసిన లేఖలో వెల్లడించింది. మరోవైపు బంగ్లా దేశ్ లో నెలకొన్న పరిస్థితుల ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిశితంగా పరిశీలిస్తోంది. ఒకవేళ అప్పటి వరకు పరిస్థితులు కుదుట పడకపోతే భారత్, శ్రీలంక, యూఏఈ లో టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్లో క్రికెట్ కు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఐసీసీ టి20 మహిళా వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్కడ స్టేడియాలను ఆధునికీకరిస్తోంది. అంతేకాదు అక్కడ మరిన్ని మైదానాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పురుషుల క్రికెట్ కు సంబంధించి బంగ్లాదేశ్లో మేజర్ టోర్నీ నిర్వహించేందుకు సైతం ఐసీసీ సుముఖంగా ఉంది. కానీ ఇంతలోనే ఆ దేశంలో అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం.