Bangladesh Vs Nepal: భళా.. బంగ్లాదేశ్.. సూపర్-8 లోకి ఎంట్రీ

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.. షకీబ్ అల్హాసన్ 17 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 17, 2024 5:16 pm

Bangladesh Vs Nepal

Follow us on

Bangladesh Vs Nepal: టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సూపర్ -8 లోకి ఎంట్రీ ఇచ్చేసింది. గ్రూప్ – డీ లో సౌత్ ఆఫ్రికా తో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్ -8 కు క్వాలిఫై అయింది. నేపాల్ జట్టుతో కింగ్స్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించి, సూపర్ -8 కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్ యువ బౌలర్ హాసిన్ సకిబ్ (4/7) నిప్పులు చెరిగే విధంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా రెండు ఓవర్లు మేయిడిన్ వేశాడు. నాలుగు వికెట్లను నేలకూల్చాడు. ఫలితంగా బంగ్లాదేశ్ కీలక మ్యాచ్ లో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 19.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.. షకీబ్ అల్హాసన్ 17 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సోంపాల్ 2/10, సందీప్ 2/17, రోహిత్ పాడల్ 2/20, దీపేంద్ర సింగ్ 2/22 బౌలింగ్లో సత్తా చాటారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు పరుగులు తీసేందుకే ఇబ్బంది పడ్డారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి బంతికే హసన్ అవుట్ అయ్యాడు. సోంపాల్ బౌలింగ్లో అతడు గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరుకున్నాడు. వాస్తవానికి బంగ్లాదేశ్ 30 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన షకీబ్ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే నేపాల్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ వెంట వెంటనే వికెట్ కోల్పోయింది. చివరికి టేలెండర్లు రిషాద్(13), తస్కిన్ అహ్మద్ (12*) దూకుడుగా ఆడటంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 19.2 ఓవర్లలోనే 85 పరుగులకు కుప్పకూలింది. తన్జీమ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లతో అదరగొట్టాడు.

మైదానంపై తేమ ఉండడంతో దానిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు తన్జీమ్. అతని ధాటికి 26 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది నేపాల్. నాలుగు ఓవర్లు వేసిన తన్జీమ్ 21 బంతుల్ని డాట్ గా మలిచాడు అంటే అతని బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి, తన కెరియర్లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. తన్జీమ్ తో పాటు ముస్తాఫిజుర్ కూడా వెంట వెంటనే వికెట్లను పడగొట్టాడు. దీంతో నేపాల్ ఓటమి అంచున నిలిచింది. నేపాల్ జట్టులో కుశాల్ మల్ల (27) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతని పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఇక నేపాల్ బ్యాటర్లలో ఐదుగురు ఆటగాళ్లు ఖాతా తెరవలేదు. ఇద్దరు బ్యాటర్లు ఒక్క పరుగు మాత్రమే చేశారు. షకీబ్ రెండు వికెట్లను నేల కూల్చాడు. ఈ విజయం ద్వారా బంగ్లాదేశ్ సూపర్ -8 కు చేరుకుంది.. భారత జట్టుతో సూపర్ -8 పోరులో భాగంగా తలపడనుంది.