https://oktelugu.com/

Rashid Khan: బొంబాయి సే ఆయా మేరా దోస్త్.. సెమీస్ వెళ్లిన తర్వాత.. రషీద్ ఖాన్ ఆసక్తికర పోస్ట్..

బంగ్లాదేశ్ పై విజయం సాధించిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలో ఉద్వేగానికి గురయ్యాడు. తోటి ఆటగాళ్లను ఆలింగనం చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 26, 2024 / 08:25 AM IST

    Rashid Khan

    Follow us on

    Rashid Khan: టి20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. పెద్ద పెద్ద జట్లను మట్టికరిపించి ఏకంగా సెమిస్ వెళ్ళిపోయింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, సూపర్ -8 దశలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను ఓడించి సెమీస్ దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా తో జరిగే సెమీస్ మ్యాచ్లో తలపడనుంది.. బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ -8 మ్యాచ్లో ఉత్కంఠ భరితమైన ఆట తీరు ప్రదర్శించింది. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది..నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. పదేపదే వర్షం ఆటంకం కలిగించినప్పటికీ.. మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ.. 115 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నారు.. తొలిసారిగా సెమిస్ వెళ్లడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్నటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది.

    బంగ్లాదేశ్ పై విజయం సాధించిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలో ఉద్వేగానికి గురయ్యాడు. తోటి ఆటగాళ్లను ఆలింగనం చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ – 8 మ్యాచ్ లో తన జిత్తులమారి డెలివరీలతో కంగారు బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ విజయం తర్వాత.. భారత్ తో జరిగిన సూపర్ -8 మ్యాచ్ లో రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచితంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.. దాన్ని చేదించడంలో ఆస్ట్రేలియా తుది వరకు పోరాడినప్పటికీ.. భారత బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఆస్ట్రేలియాను ఓడించారు. అయితే మంగళవారం ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన సూపర్ -8 పోరులో ఒకవేళ బంగ్లా గెలిస్తే.. ఆస్ట్రేలియా సెమీస్ వెళ్లే అవకాశం ఉండేది. అయితే ఎటువంటి పొరపాటుకు తావు ఇవ్వకుండా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. బంగ్లా తోపాటు ఆస్ట్రేలియాను ఇంటికి పంపించింది. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఆస్ట్రేలియా జట్టు ముందు వరుసలో ఉంది. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ వంటి టోర్నీలలో విజేతగా నిలిచిన ఆ జట్టు.. టి20 వరల్డ్ కప్ కూడా దక్కించుకోవాలని భావించింది. కానీ ఆ జట్టు ఆశలపై అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్ నీళ్లు చల్లాయి.

    బంగ్లాదేశ్ పై విజయం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సంబరాల్లో మునిగిపోయాడు. తోటి ఆటగాళ్లతో సందడి చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేశాడు.. దానికి బాంబి సే ఆయా మేరా దోస్త్(ముంబై నుంచి వచ్చాను స్నేహితుడా) అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం 2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. ఈ పోస్ట్ కు 39 వేల మంది స్పందించారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించిన అనంతరం రషీద్ ఖాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఆస్ట్రేలియా ను ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే.. ఆ తర్వాత రోహిత్ సేన మట్టికరిపించింది. రోహిత్ స్వస్థలం మహారాష్ట్ర.. దాన్ని ఉద్దేశించి రషీద్ ఖాన్ “నేను ముంబై నుంచి వచ్చాను స్నేహితుడా” అనే క్యాప్షన్ జత చేశాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.