MS Dhoni : అందరూ అనుకున్నట్టు ధోని మిస్టర్ కూల్ కాదు.. అతనిలోనూ ఒక కోపిష్టి ఉన్నాడు.. CSK మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు..

ధోని.. ఈ పేరు చెబితే మిస్టర్ కూల్ పదం గుర్తుకు వస్తుంది. ఎలాంటి ఉపద్రవం ఎదురైనా, టీమిండియా మ్యాచ్ గెలిచినా, ఓడిపోయినా పెద్దగా చలించడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన నిగ్రహాన్ని కోల్పోడు. స్థిర చిత్తాన్ని ప్రదర్శిస్తుంటాడు.

Written By: NARESH, Updated On : September 14, 2024 10:31 pm

ms-dhoni_625x300_29_Apri

Follow us on

MS Dhoni : ధోని మైదానంలో మిస్టర్ కూల్ గా ఉంటాడు. కఠిన పరిస్థితుల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అలాంటి సమయంలోను ప్రశాంతతను కోల్పోడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు సహచర ఆటగాళ్లపై కూడా పెద్దగా కోపాన్ని చూపించడు. అయితే ధోనిలోనూ కోపం ఉంటుందట.. అది కట్టలు తెంచుకునే స్థాయిలో ఉంటుందట. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.. ధోని కోపాన్ని మైదానంలో తాను స్వయంగా చూశానని అతడు వెల్లడించాడు. టీమ్ ఇండియాకు ధోని టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ దక్కేలా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచేలా చేశాడు. టీమిడియాకు మూడు ఐసీసీ కప్ లు అందించిన కెప్టెన్ గా ధోని రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ లోనూ చెన్నై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత సీజన్లో కెప్టెన్సీకి విశ్రాంతి పలికాడు. అయితే వచ్చే ఎడిషన్ లో ధోని ఆడతాడా? లేదా? అనే విషయాలపై స్పష్టత లేదు.. అయితే ధోనిపై బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి.

సాధారణ మనిషే

” ధోని అందరూ అనుకున్నట్టుగా మిస్టర్ కూల్ కాదు. అతడు కూడా సాధారణ మనిషే. అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. మైదానంలో కోపాన్ని అరదుగా వ్యక్తం చేస్తూ ఉంటాడు. కోపం ప్రదర్శిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందని ప్రత్యర్థులు భావిస్తుంటారు. అలాంటి భావన వారిలో కలగకుండా ఉండేందుకు ధోని నిశ్శబ్దంగా ఉంటాడు. కానీ ఒక ఐపిఎల్ సీజన్ లో మాత్రం ధోని ఆగ్రహాన్ని నేను లైవ్ లో చూసా. కాకపోతే అది డ్రెస్సింగ్ రూమ్ లో చోటుచేసుకుంది. చెన్నై వేదికగా బెంగళూరు జట్టుతో సీఎస్కే తలపడుతోంది. 110 పరుగుల లక్ష్య చేదనకు దిగి.. స్వల్ప వ్యవధిలోనే వికెట్లను కోల్పోయి.. చెన్నై జట్టు ఓడిపోయింది. అప్పుడు నేను అనిల్ కుమార్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాను. నిరాశగా పెవిలియన్ చేరుకున్నాను. ఈ దశలో డ్రెస్సింగ్ రూమ్ పక్కన నిలబడి ఉన్నా. ఆ సమయంలో ధోని వస్తున్నాడు. అక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ పడి ఉంది. దానిని ధోని పట్టలేని కోపంతో బలంగా తన్నాడు. ఆ సమయంలో నాకు భయం వేసింది. వెన్నులో వణుకు పుట్టింది. అతడి కళ్ళల్లోకి చూడ్డానికి నాకు ధైర్యం సరిపోలేదని” బద్రీనాథ్ వ్యాఖ్యానించాడు.

ధోని ఆడతాడా? లేదా?

ఇక వచ్చే ఐపిఎల్ లో బీసీసీఐ కొత్తగా ఒక నిబంధన తీసుకొస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అది గనక జరిగితే ధోని చెన్నై జట్టు తరఫున బరిలోకి దిగుతాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం దాటింది. అటువంటి క్రికెటర్లను “అన్ క్యాప్ డ్” క్రీడాకారుడుగా తీసుకునే అవకాశాన్ని ఈ యాజమాన్యాలకు బీసీసీఐ కల్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.