Crime news : ఆస్తికోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత బావమరిది అని చూడకుండా హతమార్చాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కుటుంబ సభ్యులను కొద్ది రోజుల వరకు నమ్మించాడు. కానీ చివరికి అసలు విషయం తెలియడంతో హత్య చేసిన వ్యక్తి జైలు పాలు కాక తప్పలేదు. దీనికి సంబంధించి గచ్చిబౌలిలోని ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
నెల్లూరు జిల్లా అగ్రహారం గ్రామ వాస్తవ్యుడు శ్రీకాంత్ కు మద్దసాని ప్రకాశం కుమార్తె అమూల్యకు 2017లో వివాహం జరిగింది. శ్రీకాంత్ గచ్చిబౌలిలోని జయభేరి కాలనీలో ఒక హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మొదట్లో హాస్టల్లో భారీగానే లాభాలు వచ్చేది. అయితే క్రమంగా శ్రీకాంత్ ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత బెట్టింగ్ నిర్వహించాడు. ఫలితంగా భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో.. ఇబ్బందులు పడుతున్నాడు. భార్య బంగారం అమ్మాడు. అప్పులకు వడ్డీ చెల్లించేందుకు స్నేహితుల వద్ద చే బదులుగా డబ్బులు తీసుకున్నాడు. అయితే వారికి ఆ డబ్బులను తిరిగి ఇవ్వకపోవడంతో ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. దీంతో శ్రీకాంత్ కు ఏం చేయాలో పాలుపోలేదు. అమూల్యకు సోదరుడు యశ్వంత్ (25) ఉన్నాడు. ఇతడు కొంతకాలంగా శ్రీకాంత్ దంపతుల వద్ద ఉంటున్నాడు. హైదరాబాదులో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అమూల్య తండ్రికి భారీగా ఆస్తి ఉంది. దానిని మొత్తం దక్కించుకోవాలంటే యశ్వంత్ అడ్డు తొలగించుకుంటే సరిపోతుందని శ్రీకాంత్ భావించాడు. ఈ క్రమంలో యశ్వంత్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ఆనంద్ తో 10 లక్షలకు సుపారి మాట్లాడుకున్నాడు. అనుకున్నట్టుగానే అతడికి 10 లక్షలు ఇచ్చాడు.. ఆనంద్ తన స్నేహితుడు వెంకటేష్ తో కలిసి శ్రీకాంత్.. సెప్టెంబర్ ఒకటి అర్ధరాత్రి యశ్వంత్ గదికి వెళ్లారు. చున్నీతో అతడి గొంతుకు బిగించి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కారులో యశ్వంత్ మృతదేహాన్ని పెట్టి ఏపీ సరిహద్దు వరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్ లో నెల్లూరు పయనమయ్యారు..
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు..
యశ్వంత్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శ్రీకాంత్ ప్లాన్ వేశాడు.. యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడని.. అతని మృతదేహం హైదరాబాద్ హాస్టల్లో ఉంటే వ్యాపారం దెబ్బతింటుందని అత్తమామలను, భార్యను నమ్మించాడు. వారు కూడా శ్రీకాంత్ చెప్పిన మాటలు నమ్మారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొద్ది రోజులకు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ముఖ్యంగా హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వారి అనుమానాలకు మరింత బలం ఏర్పడింది. దీంతో ఈనెల 10న యశ్వంత్ తండ్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మృతి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పాడు. దీంతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగుచూశాయి. శ్రీకాంత్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద 90 వేల నగదును, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. హత్యకు ఉపయోగించిన చున్ని, కారు, బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.