Delhi Premier League T20 : మైదానంలో యువ బ్యాటర్ శివతాండవం.. గాల్లో కొట్టుకుపోయిన గేల్ రికార్డు..

కాగా, ప్రియాన్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.. భావి భారత జట్టుకు ఆశా కిరణం లభించిందని అతడిని సీనియర్ ఆటగాళ్లు కొనియాడుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 10:27 pm

Delhi Premier League T20, Ayush Badoni

Follow us on

Delhi Premier League T20 : ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టి20 లో సంచలన రికార్డులు నమోదయ్యాయి. ఆయుష్ బదోని (ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు) సంచలన ఇన్నింగ్స్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు. దక్షిణ ఢిల్లీ తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు.. ఉత్తర ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రపంచ రికార్డులను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. టి20లలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అద్భుతమైన చరిత్రను సృష్టించాడు.. గేల్ పేరు మీద ఉన్న ఈ రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

అరుణ్ జైట్లీ మైదానం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణ ఢిల్లీ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. నాలుగు వికెట్లు కోల్పోయి 308 రన్స్ చేసింది. దక్షిణ ఢిల్లీ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని మైదానంలో శివతాండవం చేశాడు. 55 బంతుల్లో 165 పరుగులు చేశాడు. ఒకానొక దశలో డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేశాడు. కానీ 165 పరుగుల వద్ద అతడి ఇన్నింగ్స్ ముగిసింది. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 19 సిక్సర్లు ఉన్నాయి. దీంతో గేల్ పేరు మీద ఉన్న 18 సిక్సర్ల రికార్డు గాల్లో కొట్టుకుపోయింది. ఇప్పటివరకు గేల్ కొట్టిన 18 సిక్సర్లు ప్రపంచ రికార్డుగా ఉండేది. 2017లో జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో గేల్ రంగ్ పూర్ రైడర్స్ జట్టు తరఫున ఆడాడు. ఓ మ్యాచ్ లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టాడు.

ఏడు సంవత్సరాల తర్వాత..

గేల్ సృష్టించిన రికార్డును ఏడు సంవత్సరాల తర్వాత ఆయుష్ బదోని బద్దలు కొట్టాడు.. ఉత్తర ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆయుష్ తో పాటు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్తర ఢిల్లీ జట్టుపై ఏకంగా సెంచరీ సాధించాడు. 50 బంతుల్లోనే 120 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా 12 ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి.. ప్రియాన్ష్ ఊచకోత అనే పదానికి సిసలైన అర్థం చెప్పాడు. ప్రియాన్ష్, ఆయుష్ బదోని రెండో వికెట్ కు వేగంగా 286 రన్స్ రికార్డు పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. టి20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే హైయెస్ట్ పార్ట్ నర్ షిప్. టి20 లలో దక్షిణ ఢిల్లీ జట్టు చేసిన రెండవ అత్యధిక స్కోరు ఇది. ఆసియా క్రీడలలో మంగోలియా జట్టుపై నేపాల్ 314/3 రన్స్ చేసింది. కాగా ఉత్తర ఢిల్లీ పై దక్షిణ ఢిల్లీ ఏకంగా 112 రన్స్ తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. కాగా, ప్రియాన్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది.. భావి భారత జట్టుకు ఆశా కిరణం లభించిందని అతడిని సీనియర్ ఆటగాళ్లు కొనియాడుతున్నారు.