Pakistan Cricket : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పలు మైదానాలను ఆధునికీకరిస్తోంది. ఇలాంటి క్రమంలో తమ ఆట తీరుతో ఆకట్టుకోవాల్సిన పాకిస్తాన్ ఆటగాళ్లు గల్లీ రౌడీలను మించిపోతున్నారు. తమ జట్టు పై ఉన్న అపప్రదను మరింత పెంచుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 400+ స్కోర్ చేసింది. ఈ దశలో పాకిస్తాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఇవ్వడంతో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.. పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఫలితంగా ఇన్నింగ్స్ లో 500+ స్కోర్ చేసింది. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఎదుట తక్కువ లక్ష్యాన్ని ఉంచింది. దానిని బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ చేదించింది. ఫలితంగా పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో నెట్టింట పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ ను ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. మరోవైపు ఆటగాళ్ల తీరుపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. తొలి టెస్ట్ లో పాకిస్తాన్ దారుణ ఓటమిని మర్చిపోకముందే.. మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఓటమి అనంతరం
తొలి టెస్ట్ లో పాకిస్తాన్ పదవికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ జట్టులో మరో సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది.. తొలి టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ షాన్ మసూద్ – మరో ఆటగాడు ఆఫ్రిది దారుణంగా గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికంటే ముందు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవను ఆపేందుకు రిజ్వాన్ వెళ్లగా.. అతనిపై పిడి గుద్దులు గుద్దారని తెలుస్తోంది. ఆ దెబ్బల వల్ల రిజ్వాన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని సమాచారం. ఈ ఘటన జరిగే కంటే ముందు మైదానంలో అఫ్రిది భుజంపై మసూద్ చేయి వేశాడు. దానిని అఫ్రిది కోపంతో తోసి వేశాడు. మరోవైపు రెండో టెస్టులో అఫ్రిదిని జట్టు నుంచి తప్పించారు. దురుసు ప్రవర్తన వల్లే అతడిని జట్టు నుంచి పక్కన పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ కోచ్ గిలెస్పీ మరో విధంగా చెబుతున్నాడు. జట్టు కూర్పు కోసమే అఫ్రిదిని పక్కన పెట్టామని వివరించాడు.. బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం వల్లే పాకిస్తాన్ జట్టులో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.