Australian spinner Nathan Lyon : అరుదైన ఘనత దక్కించుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయోన్.. ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్..!

వరుసుగా 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన బౌలర్ గా తన పేరిట రికార్డును సృష్టించుకున్నాడు. ఇప్పటివరకు బ్యాటర్లు మాత్రమే ఇటువంటి రికార్డును నమోదు చేశారు.

Written By: NARESH, Updated On : June 28, 2023 8:02 pm
Follow us on

Australian spinner Nathan Lyon : ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లయోన్ అరుదైన ఘనతను సాధించాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ఆడడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లయోన్ అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు. వరుసుగా 100 టెస్టులు ఆడిన తొలి బౌలర్ గా తన పేరిట రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రేలియా జట్టు కీలక స్పిన్నర్ నాథన్ లయోన్ మరో బౌలర్ కు సాధ్యం కానీ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటివరకు బ్యాటర్లకు మాత్రమే సాధ్యమైన అరుదైన ఫీట్ ను తొలిసారి ఒక బౌలర్ నమోదు చేసుకున్నాడు. వరుసుగా 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన బౌలర్ గా తన పేరిట రికార్డును సృష్టించుకున్నాడు. ఇప్పటివరకు బ్యాటర్లు మాత్రమే ఇటువంటి రికార్డును నమోదు చేశారు. ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ కుక్ వరుసగా 159 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆ తరువాత ఆసీస్ అల్ రౌండర్ అలెన్ బోర్డర్ (153), ఈ జట్టు మాజీ ఆటగాడు మార్క్ వా (107, భారతదేశానికి చెందిన సునీల్ గవాస్కర్ (106), న్యూజిలాండ్ జట్టుకు చెందిన బ్రాండన్ మెక్ కల్లమ్ (101) ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఒక బౌలర్ గా ఇటువంటి అరుదైన ఫీట్ ను లయోన్ సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇది నాథన్ లయోన్ టెస్ట్ కెరియర్..

ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లయోన్ ఇప్పటివరకు కెరియర్లో 121 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 23 ఐదు సార్లు 5 వికెట్ల ఘనతను నమోదు చేయగా, నాలుగుసార్లు పది వికెట్ల ఘనతను దక్కించుకున్నాడు. అలాగే ఇప్పటి వరకు 495 వికెట్లను పడగొట్టాడు ఈ ఆస్ట్రేలియా బౌలర్. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే లార్డ్స్ టెస్టులో లయోన్ మరో ఐదు వికెట్లు పడగొడితే 500 వికెట్ల మైలురాయిను కూడా దక్కించుకోనున్నాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టు లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. తొలి టెస్ట్ లో సంచలన బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. బజ్ బాల్ మంత్రాన్ని జపించిన ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు చివరి నిమిషాల్లో పట్టు సడలించడంతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. రెండో టెస్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగుతుంది. మొదటి రోజు తొలి సెషన్ ప్రస్తుతం జరుగుతోంది. 16 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో 46 బంతులాడి 26 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, 51 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి అసలైన టెస్ట్ క్రికెట్ ను రుచి చూపిస్తున్న ఉస్మాన్ కవాజా ఉన్నారు.