AP Rains: ఏపీకి మరో అలెర్ట్. బంగాళాఖాతం నుంచి భారీ వర్ష హెచ్చరిక వచ్చింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. డిసెంబర్ 12 నాటికి వాయుగుండంగా బలపడవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండంగా బలపడే సమయానికి శ్రీలంక – తమిళనాడు తీరానికి చేరవచ్చు అని తెలుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, యానంలో భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రైతులతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.
* రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం
ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో ఆకాశం మేఘవృత్తంగా కనిపిస్తోంది. ఈరోజు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరు జిల్లా తో పాటు ప్రకాశంలో సైతం వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సైతం వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* పెరిగిన చలి
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్నారు.