AUS T20 & Test Whitewash: కంగారు జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో అదరగొడుతోంది. స్వదేశంలోనే కాదు.. విదేశీ మైదానాలలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసిన కంగారు జట్టు.. టి20 సిరీస్ లోనూ అదే ఫలితాన్ని ఆతిథ్య జట్టుకు అందించింది. తద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు సాధించలేని రికార్డును కంగారు జట్టు తన సొంతం చేసుకుంది. ఇటీవల ఆతిథ్య జట్టు తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పర్యాటక జట్టు 3-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా చివరి టెస్ట్ మ్యాచ్లో అయితే ఆతిధ్య జట్టును 30 పరుగుల లోపే అలౌట్ చేసి సంచలనం సృష్టించింది. టెస్ట్ సిరీస్ ఎలాగూ పోయింది. కనీసం టీ20 సిరీస్ అయిన గెలుచుకుంటుందని వెస్టిండీస్ మీద ఆ జట్టు అభిమానులకు అంచనాలు ఉండేవి. కానీ అవేవీ నెరవేరలేదు. పైగా అత్యంత దారుణంగా టి20 సిరీస్లో వెస్టిండీస్ జట్టు ప్రదర్శన సాగింది.
Also Read: జడేజాతో ఇంగ్లండ్ ఆటగాళ్ల గొడవ.. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే?
పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ జట్టు కు గొప్ప గొప్ప రికార్డులు ఉన్నాయి. ఆ జట్టు ఏకంగా రెండుసార్లు టి20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచింది. పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ప్లేయర్లను పరిచయం చేసింది. అయితే అటువంటి జట్టు ఈ ఫార్మాట్లో తేలిపోతోంది. దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకుంటున్నది. స్వదేశంలో జరిగిన సిరీస్ లోనూ అత్యంత నిరాశనకమైన ఆటతీరు కొనసాగిస్తూ ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల టెస్ట్ సిరీస్ లో దారుణమైన ఓటమి తర్వాత.. వెస్టిండీస్ జట్టుకు చెందిన లెజెండరీ ప్లేయర్లు మొత్తం భేటీ అయ్యారు. విజయాలు సాధించడానికి తీసుకోవలసిన చర్యల గురించి మాట్లాడారు. బోర్డు పెద్దలతో కూడా చర్చించారు. కానీ అవేవీ ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. పైగా వెస్టిండీస్ జట్టు పరువును మరింత దారుణంగా తీసాయి. కనీసం చివరి టి20 లోనైనా ఆతిథ్య జట్టు గెలుస్తుందనుకుంటే.. అందులో కూడా ఓటమి పాలైంది. ఒకరకంగా కంగారు ఆటగాళ్లు వెస్టిండీస్ జట్టుపై ప్రయోగాలు చేశారు.. వారు చేసిన ఏ ప్రయోగం కూడా విఫలం కాలేదు. పైగా కంగారు జట్టు ద్వితీయ శ్రేణి ప్లేయర్లను రంగంలోకి దింపితే.. వారితో కూడా పోటీ పడలేకపోయింది ఆతిథ్య జట్టు. చివరి టి20 లో ఆతిథ్య జట్టు 170 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. పర్యటక జట్టు 17 ఓవర్లలో.. 7 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించడం విశేషం. చివరి టి20 కనీసం పోటీ అయిన ఇస్తుందనుకుంటే.. అది కూడా చేతకాక ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది.. ఈ ఓటమి ద్వారా ఆతిథ్య జట్టు తన పరువు మొత్తం తీసుకుంటే.. పర్యాటక జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టి20 చరిత్రలోనే వెస్టిండీస్ పై వైట్ వాష్ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా కంగారులు నిలిచారు. వరుస వైఫల్యాల తర్వాత వెస్టిండీస్ జట్టు భవితవ్యం ఏమిటి? ఆ జట్టు మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.