aus vs sa : వాస్తవానికి ప్రోటీస్ జట్టు ఎదుట కంగారు జట్టు 282 రన్స్ టార్గెట్ విధించింది. తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు కుప్పకూలిన ప్రోటీస్ జట్టుకు ఇది పెద్ద టార్గెట్. పైగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రొటీస్ జట్టు 9 పరుగులకే రికెల్టన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ప్రోటీస్ జట్టు నిలబడలేదని.. కంగారు జట్టు బౌలర్ల ముందు తట్టుకోలేదని అందరూ ఒక అంచనాకొచ్చారు. అంతేకాదు చారిత్రాత్మకమైన విజయానికి కంగారు జట్టు కొంత దూరంలో మాత్రమే ఉందని.. దక్షిణాఫ్రికా ఐసిసి నిర్వహించే మేజర్ టోర్నీ ట్రోఫీ గెలవడం దాదాపు అసాధ్యం అని అందరూ ఒక భావనకు వచ్చేశారు. ఈ దశలో మరో ఓపెనర్ మార్క్రం(102*) అద్భుతమే చేశాడు. కంగారు బౌలర్లను అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేసిన అతడు.. సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. అంతేకాదు రెండో వికెట్ కు ముల్డర్ (27) తో కలిసి 61 పరుగులు, బవుమా(65*) తో మూడో వికెట్ కు 143 పరుగులు జోడించాడు. తద్వారా చారిత్రాత్మకమైన విజయానికి తన జట్టును 69 పరుగుల దూరంలో నిలిపాడు. నాలుగో రోజు సౌత్ ఆఫ్రికా ఇదే స్థాయిలో గనుక ఆడితే డబ్ల్యూటీసీ చరిత్రలో తొలిసారిగా విజేతగా నిలుస్తుంది అంతేకాదు 1998 తర్వాత సౌత్ ఆఫ్రికా జట్టు ఐసీసీ నిర్వహించిన ట్రోఫీ అందుకుంటుంది.
ఆపద్బాంధవుడిలా ..
కంగారు జట్టు విధించిన 282 రన్స్ చేజ్ చేస్తుందని గాని.. కంగారు బౌలర్ల ఎదుట నిలబడుతుందని గానీ దక్షిణాఫ్రికా జట్టు మీద ఏమాత్రం అభిప్రాయం లేదు. పైగా ఈ పిచ్ మీద కంగారు జట్టు బౌలర్లు దుమ్మురేపారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా జట్టును బెంబేలెత్తించారు. అంతేకాకుండా కేవలం 9 పరుగులకే ఒక ఓపెనర్ ను పెవిలియన్ పంపించారు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమని.. కంగారు జట్టుకు రెండవ డబ్ల్యూటీసి ట్రోఫీ దక్కుతుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ దశలో మార్క్రం నిలబడటం.. బవుమా తోడ్పాటు అందించడంతో సౌత్ ఆఫ్రికా జట్టు పట్టిష్టమైన స్థితిలో నిలిచింది. మూడోరోజు ఆట ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగుల దూరంలో ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి.. బవుమా, మార్క్రం ను అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఏకంగా తనతో పాటు ఐదుగురు బౌలర్లను ప్రయోగించాడు. చివరికి హెడ్ తో కూడా బౌలింగ్ వేయించాడు. అయినప్పటికీ అతడు ఊహించిన ఫలితం రాలేదు. అంతేకాదు మానసికంగా దక్షిణాఫ్రికా జట్టు మీద ఒత్తిడి తీసుకురావడానికి అతడు చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికైతే పిచ్ బ్యాటర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో.. నాలుగు రోజైన శనివారం దక్షిణాఫ్రికా జట్టు విజయం లాంచనమే.