Asia Cup 2025 Super 4: ఆసియా కప్ లీగ్ దశ ముగిసింది. భారత్, ఓమన్ జట్ల మధ్య మ్యాచ్ పూర్తయితే లీగ్ దశ పూర్తవుతుంది. ఆ తర్వాత సూపర్ 4 పోరు మొదలవుతుంది.. సెప్టెంబర్ 20 నుంచి సూపర్ 4 పోరు ప్రారంభమవుతుంది.. శనివారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా సూపర్ 4 పోరు షురూ అవుతుంది. గ్రూప్ బి లో ఉన్న శ్రీలంక టాప్ స్థానంలో నిలిచింది. శ్రీలంక బంగ్లాదేశ్ తో పోటీపడుతుంది. ఇప్పటికే లీగ్ దశలో బంగ్లాదేశ్ జట్టును శ్రీలంక ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టును సైతం మట్టికరిపించి శ్రీలంక తిరుగులేని స్థానంలో నిలిచింది. ఏకంగా టాప్ హోదాతో సూపర్ 4 పోరు కు సై అంటుంది.
ఇక బుధవారం జరిగిన మ్యాచ్లో యూఏఈ పై పాకిస్తాన్ విజయం సాధించిన నేపథ్యంలో సూపర్ 4 కు అర్హత సాధించింది. గ్రూప్ ఎ లో భారత్ మొదటి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ రెండో స్థానాన్ని సాధించింది. సూపర్ 4 కు అర్హత సాధించిన నేపథ్యంలో సెప్టెంబర్ 21న భారత జట్టుతో పాకిస్తాన్ తలబడబోతుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. గ్రూప్ దశలో పాకిస్తాన్ జట్టును భారత్ ఓడించింది. దానికంటే ముందు జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఓమన్ జట్టుతో జరిగే మ్యాచ్ కంటే ముందే టాప్ స్థానాన్ని భారత్ ఆక్రమించింది.
సెప్టెంబర్ 21న భారత్, పాకిస్తాన్ సూపర్ 4 పోరు లో తలపడతాయి. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్, భారత్ తలపడతాయి. సెప్టెంబర్ 25న బంగ్లాదేశ్, పాకిస్తాన్ పోటీ పడతాయి. ఈ రెండు మ్యాచ్లు దుబాయ్ లో జరుగుతాయి. సెప్టెంబర్ 26న భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగానే మ్యాచ్ నిర్వహిస్తారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయిలో జరిగే ఫైనల్ మ్యాచ్లో ట్రోఫీ కోసం తలపడతాయి. ఈసారి ఫైనల్ రావడానికి శ్రీలంక జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ ఎలాగూ ఫైనల్ వెళ్లడం ఖాయం కావడంతో.. ట్రోఫీ పోరు ఈ రెండు జట్ల మధ్య జరుగుతుందని తెలుస్తోంది. గత సీజన్లో కూడా ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరిగింది. నాటి మ్యాచ్లో భారత్ అత్యంత సునాయాసమైన విజయాన్ని సాధించింది. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తోంది. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.