L&T And Black Buck: ఒకప్పటి రోజులు కావు ఇవి. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించే రోజులు కావు ఇవి. మొత్తంగా చూస్తే ప్రైవేట్ కంపెనీలే చాలావరకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక ఐటీ విస్ఫోటనం వల్ల చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు అన్ని దేశాల యువతకు ఉపాధిని చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన అనే విషయాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నాయి. రాయితీలు ఇస్తూ.. భూములను కట్టబెడుతూ.. రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ తరిస్తున్నాయి. అమెరికా నుంచి ఇండియా వరకు ఇదే పరిస్థితి.
కార్పొరేట్ కంపెనీలు అన్ని వసతులు చూసుకున్న తర్వాతే కార్యకలాపాలు మొదలు పెడతాయి. రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా, మౌలిక వసతులు చూసుకున్న తర్వాతే ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఇందులో ఏది తేడా ఉన్నా సరే కంపెనీలు వెళ్ళిపోతుంటాయి. ఒక కంపెనీ ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది అంటే అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వెళ్లిపోయింది అంటే.. అక్కడ రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం. ఒక కంపెనీ వెళ్లిపోతే ఆ ప్రాంతం మీద తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. ఆర్థికపరంగా, సామాజికపరంగా ఇబ్బంది ఎదురవుతుంది.
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం బ్లాక్ బక్ అనే కంపెనీ వెళ్ళిపోతోంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో రోడ్లు గుంతలు గుంతలుగా ఉండడంతో తట్టుకోలేక తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి.. కేవలం ఈ కంపెనీ మాత్రమే కాదు.. చాలా కంపెనీలు బెంగళూరు నగరంలో ని రోడ్లు అద్వానంగా ఉండడంతో ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. అరగంట ప్రయాణానికి రెండు గంటల వరకు సమయం పడుతూ ఉండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల గుంతల వల్ల అక్షరాల ప్రతి ఏడాదికి 20వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని తెలుస్తోంది. ఇక వర్షం కురిస్తే రోడ్డుమీద వెళ్లడం కంటే లైఫ్ బోట్లలో ప్రయాణించడం ఉత్తమం అని అక్కడి ఉద్యోగులు భావిస్తున్నారట. పరిస్థితి ఇంత అద్వానంగా ఉన్నప్పటికీ బెంగళూరు డెవలప్మెంట్ అధారిటీ నిశ్శబ్దంగా ఉంటున్నదట.. దీంతో అన్ని కంపెనీలు బాబోయ్ మాకొద్దీ ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనుకుంటూ వెళ్లిపోతున్నారట. ఇదే క్రమంలో ఆ కంపెనీలను మిగతా ప్రభుత్వాలు ఆహ్వానిస్తున్నాయట. ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాయట.
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని ఇప్పటికే ఎల్ అండ్ టి భావించింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఒక వర్తమానం కూడా పంపిందని వార్తలు వస్తున్నాయి. ఎల్ అండ్ టి కంపెనీని వసూళ్ల కోసం వేధించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇప్పటికే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దీనికి తగ్గట్టుగానే మెట్రో రెండవ దశలో ఎల్ అండ్ టీ ని ప్రభుత్వం పక్కన పెట్టింది. పైకి ఆస్తులు నిర్వహణ.. ఇతర విషయాలలో ఎల్ అండ్ టీ వ్యవహార శైలి బాగోలేదని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ తెరపైకి మాత్రం వసూళ్ల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇది ఏమైనప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలో రెండు కార్పొరేట్ కంపెనీలు బయటికి వెళ్లిపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ.. ప్రభుత్వ మారాలంటూ ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పరిణామాలు ఒకరకంగా గుదిబండలే.