Ravichandran Ashwin : 144/6 వద్ద భారత్ నిలిచినప్పుడు రవిచంద్రన్ అశ్విన్ (102*), రవీంద్ర జడేజా (86) బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.. రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), గిల్ (0), కేఎల్ రాహుల్ (16) విఫలమైన చోట అశ్విన్ – జడేజా జోడి అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. భారత జట్టును పటిష్ట స్థితిలో నిలిచింది. సెంచరీ చేయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజ ఆటగాళ్ల చెంత చేరాడు. స్వదేశంలో ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. హైయెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అశ్విన్ ఈ స్థానంలో వచ్చి నాలుగు సెంచరీలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని కూడా నాలుగు సెంచరీలు చేశారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో అశ్విన్ కు ఇది వరుసగా రెండవ శతకం కావడం గమనార్హం. అశ్విన్ తన తండ్రి రవిచంద్రన్ చూస్తుండగా సెంచరీ చేయడం విశేషం. గురువారం జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ తండ్రి రవిచంద్రన్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. భారత ఆటగాళ్లు వరుసగా అవుట్ అవుతుండడంతో ఆయన ఒకింత బాధకు గురయ్యారు. అశ్విన్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్షం వ్యక్తం చేశారు. అశ్విన్ ఈ స్థాయిలో ఎదగడానికి రవిచంద్రన్ తీవ్ర కృషి చేశారు. అనేక త్యాగాలు చేశారు. అందువల్లే అశ్విన్ టీమ్ ఇండియాలో స్టార్ స్పిన్ బౌలర్ గా అవతరించాడు..
ఆపద్బాంధవుడిగా..
రవిచంద్రన్ అశ్విన్ చేసిన సెంచరీ ఆయన మొత్తం కెరియర్ లో ముందు వరసలో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భారత జట్టు 144/6 వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బ్యాటింగ్ కు దిగాడు. రవీంద్ర జడేజాతో కలిసి జట్టు భారాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్ కు అజేయంగా 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత జట్టు అత్యంత పటిష్టమైన స్థితిలో నిలిచింది. బంగ్లాదేశ్ పై ఎనిమిదవ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్.. ప్రస్తుత సెంచరీ తో కలిపి రెండు శతకాలు చేశాడు. మొత్తంగా 361 పరుగులు సాధించాడు. 23 వికెట్లు సొంతం చేసుకున్నాడు. శుక్రవారం కూడా రవిచంద్రన్ అశ్విన్ అదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. సొంత మైదానం కావడంతో మరింత రెచ్చిపోయి ఆడతాడని భావిస్తున్నారు.. ఇటీవల నిర్వహించిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడని.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. ఆ అనుభవం అతడికి ఇప్పుడు ఉపయోగపడుతుందని అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు.. అశ్విన్ డబుల్ సెంచరీ చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు అశ్విన్ కూడా డబుల్ సెంచరీ చేయాలని భావిస్తున్నాడని జాతీయ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి.