https://oktelugu.com/

Copa America 2024 : అదరగొట్టిన అర్జెంటీనా.. కోపా అమెరికా టైటిల్ కైవసం..

ప్రత్యర్థిగా బలమైన అర్జెంటీనా జట్టు ఉన్నప్పటికీ కొలంబియా ఏమాత్రం భయపడలేదు. మ్యాచ్ తొలి అర్ధ భాగం వరకు కొలంబియా అర్జెంటీనా ను చాలావరకు అడ్డుకుంది. ఆ జట్టు గోల్ చేయలేకపోయినప్పటికీ.. అర్జెంట్ పూర్తిగా నిలువరించింది. ఫలితంగా మ్యాచ్ ప్రారంభమైన తొలి రెండు అర్ద భాగాలలో(90 నిమిషాల వరకు) రెండు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో నిర్వాహకులు అదనపు సమయం కేటాయించారు

Written By:
  • Bhaskar
  • , Updated On : July 15, 2024 / 12:21 PM IST
    Follow us on

    Copa America 2024 :  ప్రపంచంలోనే అతి పురాతనమైన ఫుట్ బాల్ టోర్నీగా కోపా ఫుట్ బాల్ కు పేరుంది. ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత ఘనమైన చరిత్ర అర్జెంటీనా సొంతం. ఈ పురాతనమైన ఫుట్ బాల్ టోర్నీలో అత్యంత ఘనమైన చరిత్ర ఉన్న అర్జెంటీనా విజేతగా నిలిచింది. 23 సంవత్సరాల తర్వాత ఫైనల్ దాకా వచ్చిన కొలంబియా పై 1-0 తేడాతో అద్భుతమైన గెలుపును సాధించింది.

    ప్రత్యర్థిగా బలమైన అర్జెంటీనా జట్టు ఉన్నప్పటికీ కొలంబియా ఏమాత్రం భయపడలేదు. మ్యాచ్ తొలి అర్ధ భాగం వరకు కొలంబియా అర్జెంటీనా ను చాలావరకు అడ్డుకుంది. ఆ జట్టు గోల్ చేయలేకపోయినప్పటికీ.. అర్జెంట్ పూర్తిగా నిలువరించింది. ఫలితంగా మ్యాచ్ ప్రారంభమైన తొలి రెండు అర్ద భాగాలలో(90 నిమిషాల వరకు) రెండు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో నిర్వాహకులు అదనపు సమయం కేటాయించారు.. ఈ క్రమంలో 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ గోల్ చేసి అర్జెంటీనా కు బ్రేక్ ఇచ్చాడు. ఫలితంగా అర్జెంటీనా జట్టు 1-0 తేడాతో ఛాంపియన్ గా ఆవిర్భవించింది.

    కోపా అమెరికా కప్ లో అర్జెంటీనాకు ఇది 30వ ఫైనల్. ఆ జట్టు ఏకంగా 16 సార్లు ఫైనల్ మ్యాచ్ లలో టైటిల్స్ అందుకుంది. ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణగా అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సి నిలిచాడు. మెసేజ్ కి తన కెరియర్ లో ఇదే చివరి కోపా అమెరికా మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఆఖరి నిమిషం వరకు మెస్సి గ్రౌండ్ లో కనిపించలేదు. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో మెస్సి గాయపడ్డాడు. అతడి కుడికాలు చీలమండకు గాయమైంది. ఆ నొప్పితో అతడు చాలాసేపు బాధపడ్డాడు. మైదానంలోకి ఫిజియోథెరపిస్టులు ఆగమేఘాల మీద వచ్చి అతడికి చికిత్స అందించారు. అయినప్పటికీ అతడికి నొప్పి నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. అంతటి బాధలోనూ మెస్సి తన ఆటను కొనసాగించాడు. అలాగే ఆడుతున్న నేపథ్యంలో నొప్పి మరింత తీవ్రమైంది. ఫలితంగా మ్యాచ్ 64 నిమిషాల్లో అతడు అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. మ్యాచ్ చూస్తూ డగ్ ఔట్ లో కూర్చుండిపోయాడు. వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా విజయం సాధించడంతో మెస్సి మైదానంలోకి వచ్చి తోటి ఆటగాళ్లతో వేడుకలు జరుపుకున్నాడు. తన సుదీర్ఘ కెరియర్లో చివరి కోపా అమెరికా కప్ ఆడుతున్న మెస్సి ఉద్వేగానికి గురయ్యాడు. గాయం వల్ల మైదానాన్ని వీడడంతో అతడి అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

    ఈ మ్యాచ్లో కొలంబియా ఆటగాళ్లు దూకుడుగా ఆడినప్పటికీ.. అర్జెంటీనాను గోల్ చేయకుండా నిలువరించలేకపోయారు. అయితే గోల్స్ చేసే అవకాశం లభించినప్పటికీ కొలంబియా ఆటగాళ్లు.. చేతులారా నాశనం చేసుకున్నారు. మ్యాచ్ లో 112వ నిమిషంలో మార్టినేజ్ గోల్ సాధించడంతో అర్జెంటీనా విజేతగా ఆవిర్భవించింది.. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకున్నారు. మెస్సి ని ఆలింగనం చేసుకుని గట్టిగా నినాదాలు చేశారు. దీంతో మైదానం మొత్తం మెస్సి మెస్సి అనే నినాదాలతో హోరెత్తిపోయింది.. అభిమానుల ప్రేమను చూసి మెస్సి కూడా పొంగిపోయాడు.

    ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో కొంతమంది అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. టికెట్ లేకుండా వచ్చి మైదానంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఆ అభిమానులు మద్యం తాగి అరాచకం సృష్టించడంతో.. వారిని తిరిగి పంపేందుకు పోలీసులు, భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఫలితంగా మ్యాచ్ దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. టీవీలలో లైవ్ చూస్తున్నవారికి ఈ విషయం తెలియక.. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందేమో అనుకున్నారు.