Hyderabad: టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రెండవసారి పొట్టి ఫార్మాట్లో విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడిన టీమిండియా అద్భుతంగా ఆడింది. ఒత్తిడిని జయించి దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో రెండవసారి సగర్వంగా టి20 వరల్డ్ కప్ ను ఒడిసి పట్టుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఫైనల్ మ్యాచ్ గెలుపు అనంతరం.. బార్బడోస్ లో విపరీతమైన వర్షాలు కురవడంతో టీమిండియా నాలుగు రోజులపాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. వర్షం తగ్గిన తర్వాత ప్రత్యేకమైన విమానంలో టీమిండియా ఆటగాళ్లు న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ టీమిండియా ఆటగాళ్లపై నజరానా కురిపించారు. 120 కోట్లు బోనస్ గా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆటగాళ్లు పండగ చేసుకున్నారు.. అప్పట్లో జై షా చేసిన ప్రకటన సంచలనం కాగా.. దాన్ని మర్చిపోకముందే మరో భారీ ప్రకటన చేసి జై వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
హైదరాబాద్ కు 100 కోట్లు
బీసీసీ సెక్రటరీ జై షా హైదరాబాద్ కు భారీ వరం ప్రకటించారు. ప్రస్తుతం ఉప్పల్ మైదానానికి తోడుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు సమ్మతం తెలిపారు. హైదరాబాద్ నగర శివారులోని 100 ఎకరాల విస్తీర్ణంలో, లక్ష మంది కూర్చుని చూసే సామర్థ్యంతో, అద్భుతమైన సౌకర్యాలతో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తామని జై షా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు మీడియాకు వెల్లడించారు.” అంతర్జాతీయ మైదానం తో పాటు తెలంగాణలో ఉన్న ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో ఉపక్రీడ మైదానాలను నిర్మిస్తాం. ఆయా జిల్లాల్లో ఉప క్రీడా మైదానాల నిర్మాణానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఆయా జిల్లాలలో భూములను సేకరించిన తర్వాత కొత్త మైదానాల నిర్మాణానికి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి నిధులు విడుదల చేస్తుంది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకునే ఉద్దేశం మాకు లేదు. లీజ్ ప్రక్రియకు కూడా మేము పూర్తి వ్యతిరేకం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే భూములు కొనుగోలు చేస్తాం. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిభావంతమైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చేందుకు మేము కృషి చేస్తాం. ఇందులో భాగంగానే ఉపక్రీడా మైదానాలను నిర్మిస్తాం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికే సంప్రదించాం . ప్రభుత్వం నుంచి అనుమతులు ఇస్తే చాలు. భూములు మాకు అవసరం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేస్తామని” జగన్మోహన్ రావు వెల్లడించారు.
మార్కెట్ ధర ఎంత ఉన్నా పర్వాలేదని, ప్రభుత్వ ధర అయినా ఇబ్బంది లేదని.. ప్రభుత్వం ఇచ్చే డిస్కౌంట్ ధర అయినా సరే డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేస్తామని జగన్ మోహన్ రావు అన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్లే ప్రభుత్వ నుంచి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తవని జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంపై క్రీడా శాఖ మంత్రి తో పాటు అధికారులను కూడా తాము కలిశామని జగన్మోహన్ రావు వెల్లడించారు.
అయితే హైదరాబాద్ నగర శివారులో మరో స్టేడియం నిర్మించడానికి ప్రధాన కారణం ఉప్పల్ మైదానం సరిపోకపోవడమే. ఉప్పల్ మైదానం కెపాసిటీ 38,000. సీట్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 38వేల సీట్లు ఉంటే.. రెండు లక్షల మంది మ్యాచ్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే బీసీసీఐ హెచ్సీఏ ఆధ్వర్యంలో కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తోంది.. నూతన స్టేడియం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. పూర్తి నివేదికలతో రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులకు సూచించింది. ప్రభుత్వ సూచనల మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు కూడా పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరం తో పాటు ఇతర జిల్లాలోని అంతర్జాతీయ స్థాయిలో మైదానాలను నిర్మిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Another international cricket stadium is set up in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com