Amol Muzumdar: కొందరికి అదృష్టం ఉండదు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఇతని పరిస్థితి కూడా అటువంటిదే. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.. అంతకుమించి అనే స్థాయిలో పరుగులు తీస్తాడు. జట్టు విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఆరడుగుల ఎత్తు.. అంతకుమించిన శరీర సామర్థ్యం.. ఎలాంటి బంతులనైనా ఎదుర్కొనే దమ్ము.. ఇలాంటి పిచ్ లోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఇతడు సొంతం. వాస్తవానికి ఇంతటి సామర్థ్యం ఉన్న ఈ ఆటగాడినైనా సరే మిగతా దేశాలు కళ్ళకు అద్దుకునేవి. జట్టులోకి తీసుకునేవి. అపారమైన అవకాశాలు ఇచ్చేవి. కానీ ఇతడికి మన దేశంలో ముఖ్యంగా జాతీయ జట్టులో అవకాశం లభించలేదు. అలాగని అతడు ఎవర్ని నిందించలేదు. చివరికి తానే ఒక కర్మయోగిలాగా మారాడు. భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలిపాడు.
2005, 2017లో భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది. కానీ అప్పుడు తీవ్ర ఒత్తిడికి గురై విజేత కాలేకపోయింది. కానీ ప్రస్తుత 2025లో టీమిండియా పరిస్థితి చాలా భిన్నంగా సాగింది. ఎందుకంటే లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా టీమిండియాలో స్ఫూర్తిని నింపాడు అమోల్ మజుందార్. న్యూజిలాండ్ మీద గెలుపు.. ఆస్ట్రేలియా మీద అద్భుతమైన విజయం.. దక్షిణాఫ్రికా మీద చారిత్రాత్మకమైన గెలుపు సాధ్యమయ్యాయి. అమోల్ మజుందార్ భారత మహిళల జట్టు కోచ్ మాత్రమే కాదు.. ఒక అద్భుతమైన ఆటగాడు.. ఇతడు 30 సెంచరీలతో.. 11 వేలకు పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు చేసిన అద్భుతమైన ఆటగాడు. అయితే ఇవన్నీ కూడా అతడు డొమెస్టిక్ క్రికెట్లోనే చేశాడు. లక్ష్మణ్, గంగూలీ, ద్రావిడ్, సచిన్ వంటి ప్లేయర్లతో నాడు జట్టు నిండి ఉండేది. ఇతడిలో అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ జట్టులో చోటు లభించలేదు.. అయినప్పటికీ అతడు నిరాశ పడలేదు. తన జీవితం మొత్తం డొమెస్టిక్ క్రికెట్ వరకే ఆగిపోవడంతో బాధ కూడా పడలేదు.
భారత మహిళల జట్టు శిక్షకుడిగా తన మలి కెరియర్ మొదలుపెట్టిన అమోల్ మజుందార్.. అమ్మాయిలకు అద్భుతమైన శిక్షణ ఇచ్చాడు. చెక్ దే ఇండియా సినిమాలో షారుక్ ఖాన్ మాదిరిగా అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చి.. ఒత్తిడిని ఎలా జయించాలి.. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి.. ఎలా బౌలింగ్ చేస్తే వికెట్లు లభిస్తాయి.. ఎలా బ్యాటింగ్ చేస్తే పరుగులు సాధ్యమవుతాయి.. బంతులను ఎలా ఆపితే ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ లో పడతారు.. ఇలా అన్ని అంశాలలో అత్యంత క్షుణ్ణంగా కోచింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత టీమిండియా పరిస్థితి మారిపోయింది. వాస్తవానికి లీగ్ దశలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై ఓడిపోవాల్సి ఉండేది కాదు. కానీ ఆ మ్యాచ్ లో ఓటమి తర్వాత అమోల్ మజుందార్ భారత మహిళలపై కోప్పడ్డారు. ఆ తర్వాత తన బాధ్యతను గుర్తు చేశారు. ప్లేయర్లు ఎలా ఆడాలో గంటలకు గంటలు సెషన్లు తీసుకున్నారు. ఇది మన అమ్మాయిలకు బాగా అర్థమైంది. ఇంకా తర్వాత ఓటమి అనేది లేకుండానే దూసుకుపోయారు. ఆ న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించారు. పటిష్టమైన ఆస్ట్రేలియాను వెనక్కి పంపించారు. ప్రమాదకరమైన దక్షిణాఫ్రికాను తోక ముడిచేలా చేశారు.
” సార్ మాలో ఉన్న భయాన్ని పోగొట్టారు. ఎలా ఆడాలో నేర్పించారు. మా అందరికీ అంతర్జాతీయ క్రికెట్లో అనుభవం ఉన్నప్పటికీ.. ఆ అనుభవాన్ని గెలుపుకు దగ్గర చేసే విధంగా ఆయన ప్రయత్నించారు. చివరి వరకు ఎలా పోరాడాలో చూపించారు. అందువల్లే మేము ఇలా ఆడగలిగాం. వరుసగా మూడు ఓటముల తర్వాత.. మళ్లీ ఈ స్థాయిలోకి వచ్చామంటే మాటలు కాదు. అదంతా సార్ కృషి అని” కెప్టెన్ కౌర్ వ్యాఖ్యానించిందంటే.. అమోల్ మజుందార్ కోచింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.