Rohit Sharma: న్యూజిలాండ్ సిరీస్ నుంచి మొదలుపెడితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు (పెర్త్ టెస్టు మినహా) రోహిత్ నాయకత్వంలో టీమిండియా వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటుంది.. ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ లలో నాలుగు ఓటములను చవిచూసింది. కెప్టెన్ గానే కాకుండా.. ఆటగాడిగా కూడా రోహిత్ విఫలమవుతున్నాడు. బలమైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. దీంతో టీమిండియా వరుస ఓటములను చవిచూస్తోంది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ముందు పరువు తీసుకుంటున్నది. న్యూజిలాండ్ సిరీస్ కంటే ముందు టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ సైకిల్లో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ సిరీస్ లో పడిపోయిందో.. అప్పుడే టీమిండియా పతనం మొదలైంది. పెర్త్ టెస్ట్ మినహా.. చెప్పుకోవడానికి టీమిండియా కు ఒక్క విజయం కూడా లేకపోవడంతో విమర్శలను ఎదుర్కొంటున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ గత రెండు సీజన్లలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో, మరోసారి ఆస్ట్రేలియా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు మాత్రం దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకుంటున్నది.
విమర్శల నేపథ్యంలో
టీమిండియా దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని ఆట తీరు పట్ల.. జట్టును నడిపిస్తున్న విధానం పట్ల ఆగ్రహావేశాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి లాంటివాళ్ళు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని చెబుతున్నారు. అతడు కెప్టెన్గా ఉండటం వల్లే అవకాశాలు లభిస్తున్నాయని.. సాధారణ ఆటగాడిగా ఉంటే మాత్రం ఎప్పుడో బయటికి వెళ్లిపోయేవాడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ క్రమంలో రోహిత్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత టెస్ట్ క్రికెట్ కు హిట్ మాన్ గుడ్ బై చెప్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే t20 లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు.. ఇప్పుడు టీమ్ ఇండియాకు సిడ్ని టెస్ట్ లో విజయాన్ని అందించి.. టెస్ట్ క్రికెట్ కు స్వస్తి పలకాలని ఆలోచనలో రోహిత్ ఉన్నాడని సమాచారం. ఒకవేళ సిడ్ని టెస్ట్ లో టీమిండియా గెలిచి.. శ్రీలంక టూర్ లో ఆస్ట్రేలియా గనుక ఓడిపోతే.. టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలుంటాయి. అప్పుడు ఎలాగూ దక్షిణాఫ్రికా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది కాబట్టి.. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఓడించి.. టీమిండియా కు టెస్ట్ గదను అందించిన ఖ్యాతిని రోహిత్ శర్మ సొంతం చేసుకునే అవకాశం లేకపోలేదని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వరకు ఎదురు చూడక తప్పదని స్పోర్ట్స్ వర్గాలు భావిస్తున్నాయి.