https://oktelugu.com/

Free Bus Scheme: కొత్త సంవత్సరంలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ముహూర్తం ఫిక్స్!

ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పథకాలకు పట్టాలెక్కించాలని చూస్తోంది.

Written By: , Updated On : December 31, 2024 / 12:00 PM IST
Free Bus Scheme(1)

Free Bus Scheme(1)

Follow us on

Free Bus Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో మహిళలకు సంబంధించి కీలక హామీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. కానీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా ఈ పథకం విషయంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. ఇంకా అమలుకు నోచుకోలేదు. దీనిపై అధికారుల బృందం అధ్యయనం కూడా చేసింది. అయితే ఈ అధ్యయనానికి సంబంధించి అధికారులు సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఈ పథకం ఎప్పటినుంచి ప్రారంభించాలి అన్నదానిపై ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంలో మరికొన్ని అంశాలపై అధ్యయనం చేసి.. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో పథకం అమలు చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది.

* వరుసగా సమీక్షలు
వాస్తవానికి ఈ ఉచిత ప్రయాణం పథకంపై చాలాసార్లు సమీక్షలు జరిపారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే ఈ పథకం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో అమలు చేస్తున్నారు. తొలుత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. మహిళలు కూడా ఎంతగానో ఆదరించారు. దీంతో అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం అదే రకంగా హామీ ఇచ్చి సక్సెస్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏపీలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు పక్కాగా ఉండాలని భావిస్తున్నారు. అందుకే మరోసారి అధ్యయనం చేసి తుది నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

* ఉగాది నాటికి ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతలోగా పథకానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారట. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు తక్కువే. కానీ ప్రాధాన్యత క్రమంలో సంక్షేమాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా చూస్తున్నారు. అయితే ముందుగా మహిళలకు సంబంధించిన పథకాలకు మోక్షం కలిగించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం మొదలెట్టడానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. మరి ప్రారంభిస్తారా? లేకుంటే వాయిదా వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.