World ICC Test Championship : బంగ్లాదేశ్ జట్టుతో ఇటీవల జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను భారత్ గెలుచుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. విన్నింగ్ పర్సంటేజ్ మరింత పెంచుకుంది. ఏకంగా ఆస్ట్రేలియా జట్టును అధిగమించింది. కానీ అదే ఊపును న్యూజిలాండ్ జట్టుపై కొనసాగించలేకపోయింది. బెంగళూరు, పూణే వేదికలుగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లలో భారత్ ఓటమిపాలైంది. 2012 నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలుపెడితే ఇంగ్లాండ్ వరకు ఏ జట్టు కూడా భారత్ ను ఓడించి సిరీస్ అందుకోలేదు. కానీ 12 సంవత్సరాల తర్వాత భారత జట్టుపై స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ దక్కించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా న్యూజిలాండ్ భారత్ పై టెస్ట్ సిరీస్ సాధించింది. న్యూజిలాండ్ రెండు వరుస టెస్టులలో విజయం సాధించిన నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఆసక్తికరంగా మారాయి.
భారత్ పరిస్థితి ఏమిటంటే
రెండు వరస టెస్ట్ మ్యాచ్ లలో ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశాలు సంకటంలో పడ్డాయి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భాగంగా భారత్ ఇప్పటివరకు 13 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఎనిమిది మ్యాచ్లలో గెలిచింది. నాలుగింట్లో ఓడిపోయింది. ఒకదాని డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా కంటే భారత్ కాస్త మాత్రమే ముందంజలో ఉంది. ఇక భారత జట్టు న్యూజిలాండ్ తో నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వెళ్లాలంటే టీమిండియా వచ్చే ఆరు టెస్టు మ్యాచ్ లలో ఒకటి డ్రా చేసుకోవాలి. మిగతా ఐదు గెలవాలి. అప్పుడు భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 71.05 కు చేరుకుంటుంది. ఒకవేళ ఫైనల్ వెళ్లాలనే ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే ఆరు మ్యాచ్లలో కనీసం నాలుగు గెలవాలి. ఒకవేళ వచ్చే ఆరు మ్యాచ్లలో భారత్ రెండిట్లో మాత్రమే గెలిస్తే.. ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికీ భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లే ద్వారాలు ముగుసుకు పోనప్పటికీ.. ఇప్పటినుంచి ఆడే ప్రతి మ్యాచ్ భారత్ జాగ్రత్తగా ఆడితే.. పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే గత రెండు సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలిచింది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈసారి అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? రోహిత్ సేన ఎలాంటి అద్భుతాలు చేస్తుందో?