Qatar Vs India Football: ఫుట్ బాల్ చరిత్రలోనే ఇది అత్యంత నీచం. కనివిని ఎరగని దారుణం. ఫలితంగా భారత్ నిలువునా మోసపోయింది.. పైగా ఖతార్ తొండి ఆట ఆడితే.. దానికి రిఫరీ తలవంచాడు. దీంతో భారత్ ఓడిపోయింది. ఇది సరైన పద్ధతి కాదు, ఖతార్ చేసింది గోల్ కాదని భారత ఆటగాళ్లు నెత్తి నోరు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రివ్యూ కు వెళ్తామని చెప్పినప్పటికీ మ్యాచ్ రిఫరి ఒప్పుకోలేదు. దీంతో భారత జట్టు కొంప మునిగింది. ఈ ఓటమితో, ఫుట్ బాల్ ప్రపంచ కప్ 2026 ఆసియా జోన్ క్వాలిఫైయర్స్ మూడో రౌండ్ కు భారత్ కు అవకాశం లేకుండా పోయింది.
గ్రూప్ – ఏ లో ఖతార్ జట్టుతో భారత్ మ్యాచ్ ఆడింది. మంగళవారం రెండు జట్లు పోటీపడ్డాయి. మూడో రౌండ్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి భారత జట్టుది. అంతటి విలువైన మ్యాచ్ లో రిఫర్ చెత్త నిర్ణయం తీసుకోవడంతో భారత జట్టుకు ప్రతిబంధకంగా మారింది. ఈ పోరులో 1-2 తేడాతో భారత్ ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచి 72 నిమిషాల పాటు భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఆట ప్రారంభమైన 37వ నిమిషంలో జువాల గోల్ కొట్టి, భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కూడా భారత్ అటాకింగ్ ఆటతీరుతో అదరగొట్టింది.
ఈ క్రమంలో 73వ నిమిషంలో ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఖతార్ ఆటగాడు యూసఫ్ కొట్టిన హెడర్ ను భారత గోల్ కీపర్ గురు ప్రీత్ సింగ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత బంతి గోల్ లైన్ దాటి బయటకు వెళ్లిపోయింది. కానీ ఖతార్ జట్టు ఆటగాడు హస్మి లైన్ దాటి వెళ్లి బంతిని వెనక్కిలాగాడు. అదే సమయంలో దానిని సహచర ఆటగాడు యూసఫ్ కు పాస్ చేశాడు. యూసఫ్ దానిని అత్యంత తెలివిగా నెట్స్ లోకి పంపించాడు. దీనిని మ్యాచ్ రిఫరీ గోల్ గా ప్రకటించాడు.
రిప్లై లో బంతి లైన్ దాటినట్టు కనిపిస్తున్నప్పటికీ.. రిఫరీ ఖతార్ వైపు మొగ్గు చూపడం విశేషం. రివ్యూ కు వెళ్తామని భారత ఆటగాళ్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రిఫరీ పట్టించుకోలేదు. అదే షాక్ లో ఉన్న భారత జట్టును ఖతార్ మరో దెబ్బతీసింది. 85 నిమిషంలో గోల్ చేసింది. ఆధిక్యాన్ని 2-1 కి పెంచింది. మ్యాచ్ ముగిసేంత వరకు లీడ్ కంటిన్యూ చేసింది. ఈ విజయం ద్వారా ఖతార్ ఆసియా జోన్ క్వాలిఫైయర్స్ మూడో రౌండ్ కు అర్హత సాధించింది. భారత జట్టు ఓటమికి రిఫరీ కారణం కావడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “భారత్ గెలిచే మ్యాచ్ ఓడించావు.. నువ్వు ఫుట్ బాల్ రిఫరీ ఎలా అయ్యావు రా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.