T20 World Cup 2024: సూపర్ -8 లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనతో తలపడేది అప్పుడే..

నమిబియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 72 పరుగులకే కుప్పకూలింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 3:34 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. నమిబియా జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి, సూపర్ -8 కు దూసుకెళ్లింది. ఇప్పటికే ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ కప్ ను కూడా ఒడిసి పట్టి.. సరికొత్త రికార్డు దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ -8 కు అర్హత సాధించింది.

నమిబియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 72 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఆస్ట్రేలియా, ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కు ఇది హ్యాట్రిక్ విజయం.

గ్రూప్ – బీ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. స్కాట్లాండ్ మినహా ఇతర జట్లకు ఆ గ్రూపులో ఆస్ట్రేలియాను అధిగమించే అవకాశం లేదు. దీంతో ఆస్ట్రేలియా తర్వాత దశకు నేరుగా వెళ్లే అర్హత సాధించింది. ఆస్ట్రేలియా తన చివరి లీగ్ మ్యాచ్ స్కాట్లాండ్ తో ఆడుతుంది.. ఈ మ్యాచ్లో అద్భుతం జరిగితే తప్ప స్కాట్లాండ్ గెలిచే అవకాశం లేదు.

మరోవైపు గ్రూప్ – డీ లో ఉన్న దక్షిణాఫ్రికా కూడా సూపర్ 8 కు వెళ్లినట్టే. స్కాట్లాండ్ పై విజయం సాధించి, గ్రూప్ – బీ టాపర్ గా ఆస్ట్రేలియా నిలిస్తే.. గ్రూప్ – ఏ, గ్రూప్ – సీ లో రెండవ స్థానంలో నిలిచే జట్లతో, గ్రూప్ – డీ లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో ఆస్ట్రేలియా పోటీ పడాల్సి ఉంటుంది. గ్రూపు – డీ లో దక్షిణాఫ్రికా టాపర్ గా నిలవడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో సూపర్ -8 పోరు లో జూన్ 21న ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా పోటీ పడాల్సి ఉంటుంది..

గ్రూప్ – ఏ లో భారత్ మొదటి స్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. ఆ గ్రూప్ లో ప్రథమ స్థానంలో నిలిచి.. లీగ్ దశను భారత్ ముగిస్తే, సూపర్ -8 లో ఆస్ట్రేలియాతో పోటీ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గ్రూప్ – ఏ లో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో మాత్రమే ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్కన రెండో స్థానంలో అమెరికా లేదా పాకిస్తాన్ నిలిస్తే.. ఆ జట్టుతో అమెరికా పోటీపడాల్సి ఉంటుంది.

సూపర్ – 8 షెడ్యూల్ ఇలా (అంచనా మాత్రమే)

జూన్ 19: ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ లేదా ఆఫ్గనిస్తాన్
జూన్ 21: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా
జూన్ 23: ఆస్ట్రేలియా వర్సెస్ అమెరికా.