Boxing Day Test: యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుకు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి.. ఇప్పటికే ఈ జట్టు సిరీస్ కోల్పోయింది. వరుసగా ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఇంగ్లాండ్ మూడు ఓటములు ఎదుర్కొంది. అంతేకాదు, ఆటగాళ్లు మూడో టెస్ట్ కు ముందు విపరీతంగా మద్యం తాగారని.. అందువల్లే మూడో టెస్ట్ ఓడిపోయారని బిబిసి లో వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర ఒత్తిడిని కలగజేస్తున్నాయి. వీటిని మర్చిపోకముందే ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది.
మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా తో బాక్సింగ్ డే టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కు ముందే ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న ఆర్చర్ స్థానంలో గస్ అట్కిన్సన్ జట్టులోకి వస్తున్నట్టు ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది. ఆర్చర్ గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది. అంతేకాదు ఓలీ పోప్ స్థానంలో జాకబ్ బెతల్ కు చోటు కల్పించినట్టు ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది. పోప్ ఈ సిరీస్ లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన అతడు, 6 ఇన్నింగ్స్ లలో 125 పరుగులు మాత్రమే చేశాడు. అతడి నిర్లక్ష్యమైన బ్యాటింగ్ ఇంగ్లాండ్ జట్టును తీవ్రంగా దెబ్బతీస్తోంది.
బాక్సింగ్ డే టెస్టులో ఎలాగైనా గెలవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో ఆ జట్టు ప్లేయర్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్లే ఆర్చర్ , పోప్ స్థానాలలో కొత్త ప్లేయర్లను నియమించుకుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో తదుపరి రెండు మ్యాచ్లలో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తుంది. అట్కిన్సన్ పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా వేస్తాడు. వేగవంతమైన బంతులు వేయడంలో సుపరిచితుడు. ఇతడి ఆధ్వర్యంలో జట్టు బౌలింగ్ సమూలంగా మారుతుందని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయం సాధించి, పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.