Shinganapura Temple: గ్రహాలన్నింటిలో శని గ్రహంనకు ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే శని దేవుడు కూడా ప్రత్యేకంగా పూజించబడుతాడు. చాలా మంది మనుషులకు శని పీడ ఉందని, శని పీడను వదిలించుకోవడానికి రకరకాల పూజలు చేస్తుంటారు. కానీ శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కొన్ని బాధలు తగ్గుతాయి. వాస్తవానికి శని దేవుడు మనుషులను అకారణంగా ఇబ్బందులకు గురి చేయడు. వారు చేసే తప్పులను గుర్తిస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తారు. ఈ క్రమంలో మనుషులు కొన్ని బాధలు పడుతారు. ఒక వ్యక్తికి శని పీడ ఏడేళ్ల పాటు ఉంటుందని అంటారు. అయితే దీని నుంచి కాస్త ఉపశమనం పొందడానికి శనిదేవుడిని సందర్శించాలని చెబుతారు. సాధారణంగా శనిదేవుడికి ప్రత్యేకంగా ఆలయాలు లేవు. కానీ మహారాష్ట్రలోని శని శింగాణాపూర్ లో శని దేవుడు శిల రూపంలో దర్శనమిస్తాడు. శని శింగణాపురం ఎలా వెళ్లాలి? ఈ ఆలయం ప్రత్యేకలు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..
ఇప్పుడున్న దాదాపు అన్ని ఆలయాల్లో శని విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. దీంతో ఇక్కడే ప్రత్యేకంగా శని పూజలు నిర్వహిస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న శని శింగణాపురంలోని శని దేవుడిని దర్శించడం వల్ల అనేక శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడి శనిదేవుడిని సందర్శించడానికి దేశంలోని భక్తులే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివస్తారు. ప్రముఖ షిర్డీ ఆలయానికి 65 కిలోమీటర్ల దూరంలో శని శింగణాపురం ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో శని దేవుడికి ప్రత్యేకంగా గది అంటూ ఉండదు. శిలా రూపంలో ఓపెన్ గా దర్శనమిస్తారు. అయితే ఈ శిలకు నిత్యం తైలాభిషేకం నిర్వహిస్తారు. భక్తులు సైతం శనిదేవుడికి తైలం సమర్పించి తమ భక్తిభావాన్ని చాటుకుంటారు.
ఈ శనిదేవుడి శిల కలియుగం ప్రారంభం నుంచి ఉందని పురాణాలు చెబుతున్నాయి. శని శింగణాపూర్ చేరుకోవడానికి అనేక రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి షిర్డీకి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి. ముంబై నుంచి ప్రత్యేకంగా క్యాబ్ లేదా వాహనాల ద్వారా శని సింగణాపురం చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, చెన్నై నుంచి రాహురి స్టేషన్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుంచి 32 కిలో మీటర్ల దూరం వరకు ప్రత్యేకమైన వాహనంలో వెళ్లాలి. షిర్డీ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో శని శింగణాపురం ఆలయం ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా వెళ్లొచ్చు. విమానాశ్రయం ద్వారా వెళ్లాలని అనుకునేవారు ప్రధాన నగరాల నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడి నుంచి 161 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక వాహనంలో శని శింగణాపురం చేరుకోవచ్చు.
శని శింగణాపురం ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ ఆలయానికి మాత్రమే కాకుండా ఇక్కడున్న ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఇక్కడ ఎలాంటి వస్తువు దొంగతనం చేసినా శని పట్టి పీడిస్తాడని కొందరి నమ్మకం అందువల్ల ఇంటికి తలుపులు బిగించలేదు. కొన్ని ప్రత్యేక దినాల్లో శని శింగాణాపురం నకు భక్తులు అధికంగా వస్తుంటారు.